యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
పెనుకొండ సమీపంలోని అమ్మవారుపల్లి వద్ద కియా కార్ల పరిశ్రమ నిర్మితమైంది. జిల్లాలోని దాదాపు 5వేల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు కూలీ పనులు తప్పిస్తే ఒక్కరికీ ఉద్యోగి కల్పించలేకపోయారు. భూములు కోల్పోయిన రైతుల కుటుంబాల్లో అర్హులుంటే ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ కూడా అమలుకు నోచుకోని పరిస్థితి. పరిశ్రమకు భూములిచ్చిన రైతులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారే కానీ వీరి కుటుంబాల్లో పిల్లలకు ఉద్యోగాలు కల్పించలేకపోయారు. ముఖ్యమంత్రి పర్యటన సమయంలో భూనిర్వాసితుల పిల్లలు సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తారని భావించి అధికారులు, పోలీసులు బుజ్జగించి అడ్డుకున్నారు. తాజాగా సీఎం పర్యటన నేపథ్యంలో భూ నిర్వాసితుల పిల్లలు చంద్రబాబును నిలదీయకుండా పోలీసులు స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారు. మొత్తంగా భూములు కోల్పోయి, ఉద్యోగాలు దక్కక రైతుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఇదిలాఉంటే స్కిల్ పేరిట చెన్నై, జార్కండ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. జిల్లా కలెక్టర్ మొదలుకొని కనిపించిన ప్రతీ అధికారికి ఇక్కడి ప్రజలు చేతులెత్తి మొక్కుతున్నా ఫలితం లేకపోతోంది. కియా అంటేనే ఓ మాయా ప్రపంచంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కియా కోసం రైతుల నుంచి భూములు సేకరించి దాదాపు రెండేళ్లవుతోంది. అమ్మవారుపల్లికి చెందిన రైతులు వడ్డె సుబ్బరాయుడు, చిన్న సుబ్బరాయుడు, నాగభూషణం, చలపతి, నాగరాజులకు ఎర్రమంచి పొలం సర్వే నంబర్ 193/10లో సుమారు 5 ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా ఈ భూమి సేకరించింది. అయితేఇప్పటికీ వీరికి పరిహారం అందివ్వలేదు. ప్రస్తుతం వీరు జీవనాధారం కోల్పోయి కూలీ పనులకు వెళ్తున్నారు. వీరి పిల్లలు ఎంసీఏ, బీటెక్ చదివినా కనీసం ఉద్యోగ అవకాశం కూడా కల్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది.ప్రతి సమావేశంలో స్థానికులకే ఉపాధి కల్పిస్తాం.. కియా పరిశ్రమకు భూములిచ్చిన వారి పిల్లలందరికీ వందశాతం ఉద్యోగాలు కల్పిస్తామని స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారధి, జిల్లా కలెక్టర్ వీరపాండియన్ చెబుతున్నా ఆ దిశగా చర్యలు కరువయ్యాయి. ఇప్పటికి 45 రోజులు గడిచినా ఉద్యోగాల ఊసే లేకపోయింది. పది రోజులుగా భూనిర్వాసితుల పిల్లల చదువును బట్టి వారికి కియా పరిశ్రమలో నేరుగా కాకుండా కియా అనుబంధ పరిశ్రమలైన హుందాయ్, మొబిస్, గ్లోవిస్, డైమోస్ అనే కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు చేస్తామని ఫోన్లు చేశారు. కానీ ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. సాధారణంగా కియా అనుబంధ పరిశ్రమల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నేరుగా ఇంటర్వ్యూలు ఏడాది పొడవునా నిర్వహిస్తుండటం గమనార్హం.2015 సెప్టెంబర్ 30న గోరంట్ల మండలంలోని పాలసముద్రం వద్ద 44వ జాతీయ రహదారి పక్కన రూ.750 కోట్లతో 953 ఎకరాల్లో బెల్, నాసన్‌ల పరిశ్రమ నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, బీజేపీకి చెందిన అప్పటి రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, అప్పటి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరిలు శంకుస్థాపన చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు పరిశ్రమల నిర్మాణమే చేపట్టలేదు. అదేవిధంగా సోమందేపల్లి మండలం గుడిపల్లి వద్ద ఎయిర్‌బస్ నిర్మాణంతో పాటు ఫైవ్‌స్టార్ హోటల్ కడుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనకు ఇప్పటికీ దిక్కు లేకుండా పోయింది. ఆచరణ లేని హామీలతో నిరుద్యోగులను ఒక పథకం ప్రకారం మోసగిస్తున్న ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీని ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్ది దేశంలోని మూడు అగ్ర రాష్ట్రాల సరసన నిలుపుతామని సీఎం చేసిన ప్రకటన నవ్వులపాలవుతోంది. ఈ నేపథ్యంలో అనేక మంది నిరుద్యోగులు తమ కుటుంబాలను వీడి బెంగళూరు, చెనై, హైదరాబాద్, ముంబయి తదితర ప్రాంతాల్లో ఉద్యోగాల వేటకు వెళ్తున్నారు. పరిశ్రమల పేరుతో పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్ల మండలాల్లో వేల ఎకరాలు సేకరించిన ప్రభుత్వం బడా బాబులకు కట్టబెట్టింది.