YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీకి మళ్లీ మొండిచేయి...బాబు ఫైర్

 ఏపీకి మళ్లీ మొండిచేయి...బాబు ఫైర్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బడ్జెట్‌లో అసలు ఏపీ ప్రస్తావనే లేకపోవడం దారుణమని అన్నారు. విభజన సమస్యలపై చివరి బడ్జెట్‌లోనూ స్పందించకపోవడాన్ని బట్టే ఏపీపై వారికి ఎంత కమిట్‌మెంట్ ఉందో తెలుస్తోందన్నారు. ఏపీలో జరుగుతున్న నిరసనలు సరైనవేనని కేంద్ర బడ్జెట్‌తో మరోసారి నిరూపించిందని అన్నారు. బడ్జెట్‌లో రైల్వేజోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీతో పాటు ఏపీకి అందాల్సిన నిధులు, కేటాయింపులు, రాయితీల గురించి ప్రస్తావించలేదని చంద్రబాబు మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మొండి చేయి చూపించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విభజన సమస్యలు, విశాఖ రైల్వే జోన్ ప్రస్తావన లేకపోవడంపై అధికార టీడీపీ సహా వివిధ పక్షాల నేతలు మండిపడుతున్నారు. ఈ బడ్జెట్‌లో రైల్వే జోన్ ఉంటుందని కొద్దిరోజులుగా రాష్ట్ర బీజేపీ నేతలు ఊదరగొట్టారని, అదంతా ఉత్తిదేనని తేలిపోయిందని అంటున్నారు. ఏపీపై తనకున్న సవతి ప్రేమను మరోసారి చూపించిందని మండిపడుతున్నారు. జీవితంలో తొలిసారి నల్లచొక్కా ధరించి నిరసన తెలుపుతున్నానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అన్నీ ఇచ్చిన జన్మభూమి కోసమే నల్లచొక్కా వేసుకున్నానన్నారు. దేశంలో సీనియర్ రాజకీయవేత్తనని, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, తొలి ఎన్డీయే ప్రభుత్వంలో తాను భాగస్వామినని .. అయినా కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ బీజేపీపై విరుచుకుపడ్డారు. చివరి బడ్జెట్‌లోనైనా ఏమైనా చేస్తారా అని చూస్తుంటే.. ఏమీ ప్రకటించలేదన్నారు. బీజేపీ నేతలకు ఏపీ కనపడటం లేదా అని ప్రశ్నించారు. ఇండియా మ్యాప్ నుంచి ఏపీని తీసేస్తారేమోనని వాపోయారు. ఇవాళ్టి అన్యాయానికి పూర్తిస్థాయిలో బీజేపీదే బాధ్యత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీతో అంటకాగి అన్యాయం చేయాలనుకుంటున్నారన్నారు. రాష్ట్రానికి సహకరించేవాళ్లతోనే తాము కలుస్తామని.. తెలుగువాళ్ల కోసమే 30ఏళ్ల పాటు పోరాడిన కాంగ్రెస్‌తో చేతులు కలిపామన్నారు చంద్రబాబు.

Related Posts