YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అబ్‌కీ బార్‌... 400 కే పార్

అబ్‌కీ బార్‌... 400 కే పార్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిచి, మరోసారి కేంద్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా లోక్‌సభ ఎన్నికల్లో 400కి ఎంపీ సీట్లలో విజయాన్ని టార్గెట్‌గా నిర్ణయించుకుంది. ఈ అర్థం వచ్చే రీతిలో హిందీలో ‘అబ్‌కీ బార్‌... 400 కే పార్‌’ అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. గత సాధారణ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 336 సీట్లలో విజయం సాధించగా, ఒక్క బీజేపీనే 282 స్థానాలను దక్కించుకుంది. నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీని తన ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ,‘అబ్‌ కీ బార్‌.. మోదీ సర్కార్‌’ అనే నినాదంతో ఎన్నికల ప్రచారం సాగించి, ప్రజల్లోకి దీన్ని బలంగా తీసుకెళ్లారు. దీనికి కొనసాగింపుగా తాజా నినాదాన్ని కాషాయదళం తీసుకొచ్చింది. ‘1984 తర్వాత ఒకే పార్టీ సంపూర్ణ ఆధిక్యంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు 2014లోనే సాధ్యమైందని, తమ పనితీరును చూసి మళ్లీ బీజేపీ ప్రభుత్వమే రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.. కాంగ్రెస్‌పై ప్రజల్లో విశ్వాసం లేదు’ అని ఆ పార్టీ బీజేపీ నేత అనురాగ్‌ ఠాకుర్‌ వ్యాఖ్యానించారు. అలాగే ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోవని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలను నేరవేర్చలేదని, కాంగ్రెస్ ఏమీచేయలేదనే విషయంపై ప్రజలకు అవగాహన వచ్చిందని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో తమ పనితీరు తెలియకుండానే, మోదీని నమ్మి 282 సీట్లను కట్టబెట్టారని, ప్రస్తుతం ప్రధాని చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యాక్రమాలను గమనిస్తున్నారని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. అందుకే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ తన అబద్దపు వాగ్దానాలతో రికార్డు నెలకొల్పితే, గతం కంటే ఎక్కువ సీట్లలో గెలుపొంది సరికొత్త రికార్డు సృష్టించనున్నామని ఉద్ఘాటించారు. 

Related Posts