యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
గొలుగొండ మండలంలోని చీడిగుమ్మల గ్రామంలో గుడి ఎదురుగా మద్యం దుకాణాన్ని కొంతమంది ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారము దేవాలయాలకు విద్యాలయాలకు సుమారు 100 నుంచి 200 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలి. కానీ గ్రామంలో గుడి ఎదురుగా మద్యం షాపు నిర్వహిస్తున్న ఎక్సైజ్ అధికారులు గాని, పోలీసు అధికారులు గాని ఏ విధమైన చర్యలు చేపట్టకుండా వ్యవహరించడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రధాన రహదారికి 100 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండాలనే నిబంధన ప్రకారం గ్రామానికి దూరంగా ఉండేది. ఈ నిబంధనను రోడ్డుకు దగ్గర్లో పెట్టుకోవచ్చని ప్రభుత్వం సడలించడంతో మద్యం దుకాణాలను ప్రధాన రహదారికి చేరువుగా, గ్రామానికి నడిబొడ్డున ఏర్పాటు చేసుకున్నారు. చీడిగుమ్మల గ్రామంలో ఒక వ్యక్తి దుర్గమ్మ ఆలయం ఎదురుగా రెండు నెలల క్రితం మద్యం షాపును ఏర్పాటు చేశారు. దీనివల్ల గుడికి వచ్చే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదే మద్యం దుకాణంలో కల్తీ అమ్మకాలు చేస్తున్నారని కొంతమంది గ్రామస్తులు దుకాణదారులను నిలదీశారు. దీనిపై అప్పుడే నర్సీపట్నం ఎక్సైజ్ సిఐ రాజు, కమిషనర్‌లకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినప్పటికీ, ఫిర్యాదు చేసి రెండు రోజులు గడుస్తున్నా ఎటువంటి చర్యలూ చేపట్ట లేదు. మహిళలకు ప్రధాన సమస్య అయినా మద్యం దుకాణం ఏర్పాటుపై చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు, పోలీస్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మద్యం షాపుపై ప్రారంభం నుంచి నేటి వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం వెనుక నెలవారీ మామూళ్లు ఉండడమే కారణమని గ్రామస్తులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అధికారులు స్పందించి ఆలయం ఎదురుగా ఉన్న మద్యం దుకాణాన్ని ఆ ప్రాంతంలో తొలగించి వేరే చోటికి తరలించాలని, అలాగే అక్కడ కల్తీ మద్యం అమ్మకాలు నివారణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు