యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధమైపోయిందనే చెప్పాలి. పాలనాపరంగా తీసుకోవాల్సిన కీలక నిర్ణయాల జోరు పెంచుతూనే, మరోపక్క పార్టీపరంగా ఎన్నికలకు సమాయత్తమయ్యే చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. టీడీపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తును కూడా ఆయన ప్రారంభించినట్టు సమాచారం. జిల్లాలవారీగా నాయకులకు సంబంధించిన పనితీరు నివేదికల్ని తాజాగా తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. వీటి ఆధారంగా కొంతమంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఆయన ఖరారు చేసుకున్నట్టుగా కూడా టీడీపీ వర్గాలు అంటున్నాయి.ఫిబ్రవరిలోపుగానే అభ్యర్థులను ప్రకటిస్తానంటూ టీడీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పడం విశేషం. అయితే, కొంతమంది సిటింగ్ ఎమ్మెల్యేలతో స్వయంగా మాట్లాడాల్సి ఉందనీ, ఆ పక్రియ పూర్తయ్యాక అభ్యర్థుల ఎంపికకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేస్తాననీ అన్నారు. ఇదే సమావేశంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశంపై కూడా సీఎం మాట్లాడారు. తాను ఒక నెలరోజుల సమయంలో అన్ని జిల్లాలూ పర్యటిస్తాననీ, వీలైనన్ని బహిరంగ సభలకు హాజరౌతానని నేతలతో చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలా నిర్వహిస్తే బాగుంటుందనే అంశంపై ఎమ్మెల్యేల నుంచి కూడా చంద్రబాబు సలహాలు తీసుకున్నట్టు సమాచారం. అందరి అభిప్రాయాలతో ఒక వ్యూహాన్ని ఖరారు చేసుకుని ముందుకు సాగుదామన్నారు.ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందనీ, 17 ప్రాజెక్టులు పూర్తి చేశామనీ, మరో ఆరు నిర్మాణంలో ఉన్నాయనీ, నాలుగు లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేస్తున్నామనీ… ఇవన్నీ ప్రజల్లోకి ఎమ్మెల్యేలు సమర్థంగా తీసుకెళ్లాలని చంద్రబాబు అన్నారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలనీ, ప్రారంభోత్సావాలను కూడా నిర్వహించుకోవాలన్నారు. మొత్తానికి, టీడీపీ ఎల్పీ సమావేశంలో ఎన్నికలకు సమాయత్తం కావడంపైనే ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చించారని తెలుస్తోంది. ఫిబ్రవరిలో అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చంద్రబాబు చెప్పడంతో… ఆశావహుల దృష్టంతా అటువైపే ఉంటుందనడంలో సందేహం లేదు.