యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
బిజూ జనతా దళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎప్పుడూ అంతే. ఆయన ఎప్పుడూ ఒంటరి పోరునే కోరుకుంటారు. బిజూ జనతాదళ్ కు ఒంటరిపోరే లాభిస్తుందని అనేక ఎన్నికల నుంచి స్పష్టమవుతూనే వస్తోంది. వరుసగా నాలుగుసార్లు విజయాలను చవిచూసిన నవీన్ పట్నాయక్ ఐదో సారి కూడా ఒంటరిపోరుకే సిద్ధమయ్యారు. ఇందుకు ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయి. బీజేపీ ఒడిశాలో కొంత మేర బలపడుతోంది. అలాగే కాంగ్రెస్ కు దేశవ్యాప్తంగా కొంత అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చుకుంటే తాను లాభపడవచ్చన్న అంచనాలో నవీన్ పట్నాయక్ ఉన్నారన్నది వాస్తవం.అందుకే ఆయన తాము వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. సాధారణంగా ఇరవై ఏళ్లుగా ఒకే పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత సహజంగానే వస్తుంది. నవీన్ పట్నాయక్ కూడా అందుకు అతీతుడేమీ కాదు. ఇప్పటికే ఒడిశాలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని వివిధ సర్వేల్లో స్పష్టమవుతోంది. అందుకోసం ఆయన ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకునేందుకు కొత్త పథకాలను ప్రవేశపెడుతూ వస్తున్నారు. రైతుల కోసం కాలియా పథకాన్ని నవీన్ ప్రవేశపెట్టారు. రైతులకు పెట్టుబడి అందించడమే ఈ పథకం లక్ష్యం. దీనివల్ల అసంతృప్తిగా ఉన్న రైతాంగం తనవైపు మరలుతుందన్నది నవీన్ పట్నాయక్ అంచనా.మహిళలకోసం మిషన్ శక్తి పథకాన్ని ఎప్పటి నుంచో నడుపుతున్నారు. దీనికి తోడు తాజాగా మహిళా సంఘాలకు రూ.17,500ల చెక్కులతో పాటు సెల్ ఫోన్ కొనుగోలుకు మూడు వేల రూపాయలు అందజేశారు. అలాగే మహిళల రిజర్వేషన్ల విషయంలోనూ తాము ముందున్నామని చెబుతున్నారు. ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు నవీన్ గత కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గత ఎన్నికలలో ఆయకు 117 స్థానాలు దక్కాయి. ఒడిశాలో మొత్తం 147 సీట్లు ఉంటే అత్యధికంగా నవీన్ కైవసం చేసుకున్నారు. 21 లోక్ సభ స్థానాల్లో 20 స్థానాలను దక్కించుకుని గత ఎన్నికల్లో సత్తా చాటారు. సేమ్ రిజల్ట్ రావాలని నవీన్ గట్టిగానే శ్రమిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బలపడినట్లు కన్పించినా.. దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వీస్తున్న గాలులు సయితం ఒడిశాను తాకుతాయని ఆయన నమ్ముతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఒడిశాలో బలంగా ఉన్నట్లు కన్పించినా అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో త్రిముఖ పోటీ ఉంటేనే సులువగా గట్టెక్కుతామన్న భావనలో నవీన్ ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను బీజేపీ, కాంగ్రెస్ లు చీల్చుకుంటే ఐదో సారి కూడా విజయం తమదేనన్న ధీమాలో నవీన్ ఉన్నారు. మరి ఆయన గణాంకాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.