యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఇంటర్ విద్యార్థినికి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఓ కానిస్టేబుల్ ఆమెతో సహా పరారయ్యాడు. విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కానూరుకు చెందిన మైనర్ బాలికను తీసుకుని, ఓ కానిస్టేబుల్ అదృశ్యం కావడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపడంతో సదరు కానిస్టేబుల్ పై ఫోక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... పడమట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న బండి హరి కానూరులో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. తన పక్కంటిలో ఉండే ఇంటర్ చదివే బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పాడు. వారం రోజుల కిందట ఆ బాలికను తీసుకుని పరారయ్యాడు. దీనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ హరి తమ కుమార్తెను అపహరించాడని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు కుమార్తె ఎక్కడ ఉందో వెదికి తమకు అప్పగించాలని వారు పోలీసులను కోరారు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు, వారి కోసం గాలింపు చేపట్టారు. కానిస్టేబుల్ మొబైల్ సిగ్నల్ ఆధారంగా వారు అనంతపురంలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు, విజయవాడకు తీసుకొచ్చారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన అధికారులు, అతడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతపురం జిల్లాకు చెందిన హరి 2017లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. శిక్షణ పూర్తిచేసుకున్న అనంతరం అతడికి విజయవాడ పడమట పోలీస్ స్టేషన్‌లో పోస్టింగ్ వచ్చింది.