Highlights
- సున్నం వేసేవాళ్లు చనిపోతే రైతులేనా?
- కూలి చేసే వాళ్లు చనిపోతే రైతుల ఖాతాలో వేస్తారా?
- ప్రెస్ వాళ్లు అదే రాస్తున్నారు
- పబ్లిక్ కూడా అదే మాట్లాడుతున్నరు
- తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని
తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి రైతులపై నోరు పారేసుకున్నారు. రైతులపై, రైతు ఆత్మహత్యలపై అడ్డగోలుగా మాట్లాడి వివాదంలో చిక్కుకున్నారు. ముక్కుసూటిగా మాట్లడడం.. ఉన్నది ఉన్నట్లు చెప్పడంలో నాయిని నర్సింహ్మారెడ్డికి పేరుంది. కానీ రైతు ఆత్మహత్యలపై ఇష్టం వాచినట్టు మాట్లాడడమేంటని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం సంగారెడ్డిలో పర్యటించిన సందర్భంలో నాయిని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా రైతు ఆత్మహత్యల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఏ సమయంలో నాయిని అభ్యంతరకరమైన కామెంట్స్ చేశారు. కూలి చేసుకునే వ్యక్తి చనిపోతే అది రైతు ఆత్మహత్యగా క్రియేట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సున్నం వేసే వ్యక్తి చనిపోయినా రైతు ఆత్మహత్య అంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రెస్ వాళ్లు కూడా అబద్ధాలే రాస్తున్నారని నాయిని విమర్శించారు. డబ్బులొస్తాయని చెప్పి పేదోడని ప్రెస్ వాళ్లు ఆత్మహత్య చేసుకున్న వాళ్లందరినీ రైతులుగా చిత్రీకరించారని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజలు కూడా అదే ధోరణిలో మాట్లాడుతున్నారని హోంమంత్రి నాయిని విమర్శించారు.