YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పెద్ద కొడుకు" పెద్ద మనస్సును మనసారా దీవిద్దాం పదిరెట్ల పింఛన్ల పెంపుతో ఏటా 14వేల కోట్లు

పెద్ద కొడుకు" పెద్ద మనస్సును మనసారా దీవిద్దాం పదిరెట్ల పింఛన్ల పెంపుతో ఏటా 14వేల కోట్లు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకుగా పెద్ద మనస్సుతో చేస్తున్న సహాయాన్ని, సంక్షేమ పథకాల ఫలాలను మనసారా దీవించాలని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారంనాడు రాయనపాడు, ఇబ్రహీంపట్నం గ్రామాల్లో జరిగిన పింఛన్ల పండుగ మరియు పసుపు-కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి ఉమా మాట్లాడుతూ, రాష్ర్టంలో 16వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా, ఆ ఆర్థిక ఇబ్బందులను లెక్కచేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఏపీలో పింఛన్లను పదిరెట్లు పెంచారని, పసుపు-కుంకమ పథకం కింద ఒక్కో డ్వాక్రా మహిళకు పదివేల రూపాయలు ఆర్థికసాయం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటువంటి విప్లవాత్మక కార్యక్రమాల అమలును ఒర్వలేక వైకాపా పార్టీ తన బాకా పత్రికతో అసత్య ప్రచారం చేస్తున్నట్లు వాటిని నమ్మొద్దని పిలుపునిచ్చారు. ఒకే విడతగా ఫిబ్రవరి 2న రూ.2500లు, మార్చి 8న మరో 3500లు, ఏప్రిల్ 5న 4వేలు మూడు విడతల చెక్కులను ఒకేసారి అందజేస్తున్నామని ఆయా తేదీల్లో డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుండి ఈ సొమ్మును తీసుకోవచ్చని చెప్పారు. మహిళల కష్టాలకు వేడినీళ్లకు చన్నీళ్లుగా ఉండేలా ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. రాష్ర్టంలో పసుపు-కుంకుమ పథకం కింద రూ.22వేల కోట్లు, పింఛన్ల పథకం కింద 54లక్షల మందికి రూ. 14వేల కోట్లు అందజేస్తున్నామన్నారు. నాలుగేళ్ళ క్రితం చంద్రన్న భీమా కింద ఒక్కో లబ్ధిదారుడు రూ.15/-లు కట్టాలని చెబితే, ప్రతిపక్ష పార్టీ కట్టొద్దని చెప్పిందని ఐనా ప్రభుత్వమే ఆ సొమ్మును చెల్లించి చంద్రన్న భీమా ద్వారా రూ.2400కోట్లు బాధిత కుటుంబాలకు సాయం అందజేసినట్లు మంత్రి ఉమా తెలిపారు. అవినీతి కేసుల్లో ఇరుక్కుపోయిన నాయకులు గ్రామాల్లోకి వచ్చి చిలకపలుకులు వల్లెవేస్తూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని, బ్యానర్లపై బ్యానర్లు కట్టి రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాష్ర్టంలో జరుగుతున్న అభివృద్ధి పరంపరను అర్థంచేసుకొని ప్రజలంతా చైతన్యవంతులుగా మెలగాలని, రాబోవు కాలంలో ఏలాంటి తప్పిందం చేసినా చారిత్రక తప్పిదమౌతుందని అది రాష్ర్ట ప్రగతికి అవరోధంగా మారుతుందని ఉద్భోదించారు. కార్యక్రమానికి ముందు ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసారు. ఈ కార్యక్రమాలలో వేలాదిమంది పింఛన్ లబ్ధిదారులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఈ సభల సందర్భంగా గ్రామాలన్నీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అధికారులు, తెలుగుదేశం శ్రేణులు బ్యానర్లు, తోరణాలు కట్టి మేళతాళాలను ఏర్పాటు చేసారు. భోజన కార్యక్రమాలను కూడా పర్యవేక్షించారు. దీంతో గ్రామాలలో పింఛన్ల పండుగ వాతావరణం ప్రత్యేక ఆకర్షణగా లబ్ధిదారుల ప్రశంసలు పొందింది._

Related Posts