కేంద్ర మధ్యంతర బడ్జెట్ లో ఎన్ని తీపికబుర్లు ఉంటాయని ఊరించిన పరిణామం నిజం చేస్తున్నట్లుగా...తాజా బడ్జెట్ లో నిర్ణయాలున్నాయని పలువురు భావిస్తున్నారు.కాని కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన పన్ను రాయితీల్లో తిరకాసుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. శ్లాబులు - పన్ను రేట్లు మార్చకుండానే చేసిన ఈ ప్రతిపాదనలు ప్రజలను గందరగోళంలో పడేశాయి. రూ.5 లక్షల వరకు ఆదాయం ఉంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదన్న మాటలో మతలబు ఉంది. ఆదాయం పన్నులోని వివిధ సెక్షన్ల కింద పన్ను ఆదా చేసే సాధనాల్లో మదుపు చేసిన తర్వాత నికర ఆదాయం రూ. 5 లక్షలు లేదా అంతకన్నా తక్కువగా ఉంటే - మొదటి శ్లాబు రూ. 2.5 నుంచి రూ. 5 లక్షల లోపు ఆదాయంపై చెల్లించాల్సిన రూ.12500 పన్నుకు సెక్షన్ 87ఏ కింద రిబేటు ఇచ్చారు. రూ. 5లక్షలకు ఒక్క రూపాయి అధికంగా ఉన్నా ఆ శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సిందే. మరో మాటలో చెప్పాలంటే 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ప్రయోజనం కనిపిస్తున్నా అంతకుమించిన ఆదాయం ఉన్నవారికి అంతగా ప్రయోజనం లేనట్టే.మరింత వివరంగా చెప్పాలంటే... కొత్త ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రకటించినవి కొన్ని స్వాగతించదగిన విధంగానే ఉన్నాయి. ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని రెట్టింపు చేస్తున్నామని ప్రకటించినా.. శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో తాజా బడ్జెట్ తో అల్పాదాయ వర్గాలకు మాత్రమే ప్రయోజనం కలిగినైట్లెంది. లోతుగా గమనిస్తే ఆదాయం పన్నుపై రిబేటు మాత్రమే మారిందని చెప్పవచ్చు. ఉదాహరణకు మీ స్థూల ఆదాయం రూ.6.5 లక్షలైతే.. రూ.1.5 లక్షల వరకు పీపీఎఫ్ వంటి పన్ను ఆదా పథకాల్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. తద్వారా మీ వార్షిక ఆదాయాన్ని రూ.5 లక్షలకు తగ్గించుకోవచ్చు. దీంతో మీకు పన్నులు వర్తించవు. ఈ కొత్త రిబేటు గరిష్ఠంగా రూ.12500. అంటే ఇప్పుడున్న శ్లాబుల ప్రకారం వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలు దాటితే.. రూ.5 లక్షల వరకు పడుతున్న పన్ను మొత్తం అన్నమాట. ఇదిలావుంటే ట్యాక్స్ సేవింగ్స్ల్లో పెట్టుబడుల తర్వాత కూడా ఒకవేళ మీ ఆదాయం రూ.5 లక్షలకుపైగా ఉంటే.. మీకు ఈ రిబేటు రూపాయి కూడా రాదు. అంతేగాక శ్లాబుల ప్రకారం పన్నులు చెల్లించాల్సిందే!