యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
పేరుకు పెద్ద ఆస్పత్రి.. సౌకర్యాలు మాత్రం మండల ఆస్పత్రి కంటే దారుణంగా ఉంటాయి. సర్కారి దవాఖానా అన్న పేరు తప్ప సరిపడ మందులు ఉండవు. కాసుల్లేకుండా వైద్యం ఉండదు. దోపిడీలో ప్రైవేటు ఆస్పత్రికంటే దారుణంగా ఉందని రోగులు వాపోతున్నారు. అసలు ఆస్పత్రి ఎక్కడుంది. రోగుల బాధలేంటో తెలియాలంటే ఓ సారి పెద్దపల్లి వెళ్లాల్సిందే.
కరీంనగర్ జిల్లా పునర్విభజన తర్వాత పెద్దపల్లి జిల్లాగా ఏర్పడింది. గతంలో నామా మాత్రపు సౌకర్యాలుండే పెద్దపల్లి పీహెచ్ సీని కాస్తా వంద పడకల ఆస్పత్రిగా మార్చేశారు. కానీ పేరుకే పెద్దాస్పత్రి తప్ప సౌకర్యాలు మాత్రం దారుణంగా ఉన్నాయి. రోగులు ఆస్పత్రికి రావాలంటే ఉన్న రోగాలు కంటే కొత్త రోగాలు ఎక్కడ తెచ్చుకుంటామో అని జంకు తున్నారు
ప్రభుత్వ ఆస్పత్రిలో పురుడు పోసుకుంటున్న గర్బిణీలకు కేసీఆర్ కిట్ల పంపిణి విషయంలో ఆస్పత్రి సిబ్బంది జాప్యం చేస్తున్నారని రోగులు మండిపడుతున్నారు. కేవలం పురుడు పోసుకున్న సమయంలో ఫోటోలకు మాత్రమే కేసీఆర్ కిట్లు ఇస్తున్నట్లు సిబ్బంది ఫోజు ఇస్తారని, అడిగిన ప్రతిసారి స్టాకు లేదని తర్వాత రండి అనే సమాధానం బాలింతలకు ఎదురవుతోంది.
ఇక మాత శిశు సంరక్షణ వార్డుల్లో పరిస్థితి మాత్రం దారుణంగా ఉందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డులో పరిసరాలన్ని అపరిశుభ్రంగా ఉన్నాయని మహిళలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటనీ అధికారులను ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇవ్వడం లేదని వాపోతున్నారు.
పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేటు ఆస్పత్రులకు మించిన దోపిడి ఉందని రోగులు వాపోతున్నారు. ఆస్పత్రిలో కింది స్థాయి సిబ్బంది చేతివాటం చూయించడంలో సిద్ధహస్తులని రోగులు ఆరోపిస్తున్నారు.. గర్బిణి స్త్రీలు ప్రసవించినప్పుడు 500 రూపాయలని..బెడ్ షీట్ మారిస్తే రెండువందలని, ఉడ్చేవారికి రెండువందలు, రోగులు తిరిగి ఇంటికి వెళ్లే టప్పుడు మూడువందలు ఇలా ప్రతి పనికి ఓ రేటును ఫిక్స్ చేశారంటూ రోగులు తెలుపుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని సేవలు ఫ్రీ కదా అని వారి చేతులు తడపకపోతే తిట్ల దండకంతో శాసనార్థలు పెడతారని రోగులు వెల్లడిస్తున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులు ప్రైవేటు ఆస్పత్రలుకు ధీటుగా పని చేయాలనిన ప్రభుత్వ పిలుపు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి.. ఇప్పటికైన సర్కారీ దవాఖానలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని రోగులు అభ్యర్థిస్తున్నారు.