యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
గోదావరిలో నీటిమట్టం రోజు రోజుకు పడిపోతోంది. గత పదేళ్లుగా గోదావరి ఏటా ఇదే రోజుల్లో ఎండిపోతుంది. ఇటీవల వచ్చిన పెథాయ్ తుపాన్ కారణంగా గోదావరి నీటిమట్టం ఇంతవరకు నిలకడగా ఉంది. గతేడాది వర్షాలు అంతగా కురవకపోయినా అదనపు జలాలను నవంబరు నెలాఖరు వరకు విడుదలచేశారు. సాగునీటికి ఇబ్బందులు రాలేదు. డెల్టాలో 4.60 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయాల్సి ఉండగా.. ఇంత వరకు 4.50 లక్షల ఎకరాల్లో పూర్తి చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో మిగిలిన 10 వేల ఎకరాల్లో నాట్లు పూర్తిచేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
కొన్ని రోజులుగా ఇన్‌ఫ్లోలు పడిపోవడంతో గోదావరి తన రూపునే మార్చేసుకుంటోంది. ఈ ఏడాది ఇన్‌ఫ్లోలు ఆశాజనకంగా ఉండవని గుర్తించిన అధికారులు పూర్తి స్థాయిలో కాకుండా కొంత ఆయకట్టుకు సాగునీరు అందించాలని భావించారు. అయితే ఎన్నికల ఏడాది కావడంతో ఉభయగోదావరి జిల్లాల్లో ఇటీవల నిర్వహించిన నీటిపారుదల సలహా మండలి సమావేశాల్లో పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. ప్రస్తుతం గోదావరి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. గోదావరి నదికి ప్రస్తుతం 5,727 క్యూసెక్కుల నీరు సీలేరు నుంచి వస్తుంది. గోదావరి పరిధిలోని మూడు డెల్టాలకు 7,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా వాటిలో సీలేరు జలాలే 5,727 క్యూసెక్కుల వరకు ఉండటం గమనార్హం. గోదారికి వచ్చి చేరుతున్న ఇన్‌ఫ్లోలు 1473 క్యూసెక్కులు మాత్రమే. ప్రస్తుతం వరి పంట కొన్ని ప్రాంతాల్లో పిలకలు వేస్తుంటే అక్కడక్కడ దమ్ములు చేయడంతో పాటు నాట్లు వేయడం వంటి పనులు సాగుతున్నాయి. పిలకల తొడిగే దశలోని పంటకు సాగునీరు చాలా అవసరం. కానీ రోజు రోజుకు నీటి విడుదలను తగ్గిస్తున్నారు.
ఒక క్యూసెక్కు నీటిని 70 ఎకరాలకు అందించాల్సి ఉండగా.. ప్రస్తుతం ఒక క్యూసెక్కు నీటిని 121 ఎకరాలకు సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 2017లో వంతుల వారీ విధానాన్ని ఫిబ్రవరి నెలలో అమలు చేయగా, గతేడాది జనవరి మొదటి వారం నుంచే అమలు చేశారు. ఈ ఏడాది మొదట్లో అదే పరిస్థితి ఉన్నా.. ఫైథాన్ తుపాన్‌తో ఇన్‌ఫ్లోలు పెరగడంతో ఇంత వరకు ఇబ్బందులు లేకుండా రబీ సాగింది. ప్రస్తుతం ఇన్‌ఫ్లోలు తగ్గుతుండటంతో రబీని సీలేరు జలాలు గట్టెక్కిస్తున్నాయి. గోదావరిలో ఇన్‌ఫ్లోలు పడిపోతుండటంతో ఉభయగోదావరి జిల్లాలపరిధిలోని తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు సాగునీటి విడుదలను తగ్గిస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే మూడు డెల్టాలకు 700 క్యూసెక్కుల విడుదలను తగ్గించారు. ఫలితంగా శివారు ప్రాంతాలకు సాగునీరు సక్రమంగా అందడం లేదు.
ఇన్‌ఫ్లోలు తగ్గుతుండటంతో గోదావరిలో నీటిమట్టం క్రమంగా పడిపోతోంది. గత నెల 29న 13.99 మీటర్లున్న నీటిమట్టం ఈ నెల 15న 13.60 మీటర్లకు చేరింది. 26న 12.83 మీటర్లు ఉండగా, ప్రస్తుతం 12.74 మీటర్లకు పడిపోయింది. సాధారణంగా గోదావరి నీటిమట్టం 14.02 మీటర్లుంటే ఉభయగోదావరి జిల్లాల్లో పంటకు ఇబ్బందులు లేనట్లు లెక్క. ఎండలు ముదిరితే రానున్న రోజుల్లో నీటమట్టం మరింత పడిపోతుంది. ఈనెల 25 నుంచి వంతులవారీ విధానాన్ని అమలు చేస్తున్నారు.
సాగునీటి ఇబ్బందులు ఈవిధంగా ఉంటే రానున్న రోజుల్లో మంచినీటికీ ఇక్కట్లు ఎదురయ్యే పరిస్థితి ఉంది. డెల్టాలోని 29 మండలాల ప్రజల తాగునీటి అవసరాలకు గోదావరి జలాలే ఆధారం. ఏలూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం, తణుకు, నరసాపురం పురపాలక సంఘాల పరిధిలోని ప్రజలకు ఈ నీరే ఆధారం. ఏప్రిల్ నుంచి జూన్ వరకు జిల్లా ప్రజలకు తాగునీటి అవసరాలకు 2.20 టీఎంసీలు అవసరం. సాగుకు సాధారణంగా 50 టీఎంసీలు అవసరమవుతుంది. మార్చి నెల చివరి వరకు కాలువలకు సాగునీరు అందించనున్నారు. కాలువలు మూసివేసే సమయంలో పది రోజుల ముందు తాగునీటి చెరువులు నింపడానికి అవకాశం ఇస్తారు. కీలక దశలో ఉన్న వరి పంటకే కనీసం 4 వేల క్యూసెక్కుల సాగునీరు అందించలేకపోతున్నారు. సాధారణంగా ఏటా కాల్వలు మూసేసే సమయంలో పది రోజుల ముందు తాగునీటి చెరువులకు ప్రత్యేకంగా నీటిని వదులుతారు. డెల్టా పరిధిలో సుమారు 490 వరకు మంచినీటి చెరువులున్నాయి. వాటిని పూర్తిగా నింపితే 40 రోజులకు సరిపోతాయి.