యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కడప ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. కడప నుండి శుక్రవారం సాయంత్రం 5గంటలకు విశాఖపట్నంకి తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరింది. దీంతో కడప నుండి నేరుగా విజయవాడ, విశాఖపట్నంకు రైలు సౌకర్యం కల్పించినట్టయింది. ప్రయాణికుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు మార్గాన్ని పొడిగించాలని కడప, రాజంపేట మాజీ పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పలుసార్లు పార్లమెంటులో చర్చించారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను వీరు స్వయంగా కలిసి వినతి పత్రాలు సమర్పించారు. దక్షిణ మధ్య రైల్యే బోర్డు మీటింగ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం రైలును పొడిగించాలని పట్టుపట్టారు. అందుకు స్పందించిన కేంద్ర మంత్రి, దక్షిణ మధ్య రైల్వేబోర్డు అధికారులు తిరుపతి వరకు కొనసాగుతున్న తిరుమల ఎక్స్ ప్రెస్‌ను కడప వరకు పొడగించాలని నిర్ణయించారు. శుక్రవారం సాయంత్రం కడప నుంచి రైలు తిరుపతికి బయలుదేరింది. అటునుంచి విశాఖకు బయలుదేరుతుంది. నిన్నటి వరకు ప్రయాణికులు విజయవాడకువెళ్లాలంటే ధర్మవరం–విజయవాడ రైలును ఆశ్రయించాల్సి వచ్చేది. ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు,నంద్యాల మీదుగా వెళ్లాల్సి వచ్చేది. వారానికి 3రోజులు మాత్రమే ఈ రైలు నడుస్తోంది దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు విశాఖ–తిరుమలఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి రోజు నడుస్తుంది కాబట్టి రాజధానికి వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి.విశాఖ–కడప ఎక్స్‌ప్రెస్ రైలు విశాఖపట్నంలో ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి విజయవాడ మీదుగా తిరుపతికి మరుసటి రోజు ఉదయం 4.50 గంటలకు చేరుకుంటుంది. తిరుపతి నుంచి 5.20 గంటలకు బయలుదేరి రైల్వేకోడూరు, రాజంపేట, నందలూరు మీదుగా 8.25 గంటలకు కడప రైల్వేస్టేషన్‌కు వస్తుంది. ప్రతి రోజు సాయంత్రం 5.05 గంటలకు కడప స్టేషన్‌లో బయలుదేరి తిరుపతికి రాత్రి 8.00 గంటలకు చేరుకుంటుంది. అక్కడినుంచి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి మీదుగా విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, ద్వారాపూడి, సామర్లకోట, అన్నవరం, యలమంచిలి, దువ్వాడ, విశాఖపట్నంకు ఉదయం 11.30 గంటలకు చేరుకుంటుంది. మాజీ ఎంపీలకు, దక్షిణ మధ్య రైల్యే అధికారులకు జిల్లాలోని ప్రయాణికులు కృతజ్ఞతలు చెబుతున్నారు.