యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
విభజన తర్వాత రాష్ట్రంలో అస్తిత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఒంటరిపోరుకు సిద్ధపడాల్సిన పరిస్థితి ఎదురయింది. కొన్ని నెలల కిందట చోటుచేసుకున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్‌తో దోస్తీ కట్టింది. కేంద్రంలో రాహుల్ నాయకత్వాన్ని బలపరుస్తూ చంద్రబాబు సపోర్టు చేశారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలోనూ త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తు ఉంటుందని భావించారు. ఈ మేరకు పొత్తులో భాగంగా యాభై అసెంబ్లీ స్థానాలైనా కాంగ్రెస్‌కి పోటీచేయడానికి దక్కుతాయని ఆ పార్టీ శ్రేణుల్లో ఆశలు రేకెత్తాయి. ఏపీలో టీడీపీతో ఎన్నికల పొత్తులేదు అని ఇటీవల ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి ఉమెన్‌చాందీ చేసిన ప్రకటనతో ఆ ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడలో లేకపోయినా.. ఆ పార్టీలో పలువురు సీనియర్ నాయకులు మాత్రం పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గిడుగు రుద్రరాజు వంటి పేరొందిన నేతలు ఇంకా కాంగ్రెస్ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఒంటరిపోరుకు సిద్ధమవుతూ.. పూర్వ వైభవం తెచ్చుకునేందుకు ఆ పార్టీ సీనియర్ నేతలు వ్యూహాలు రూపొందించుకుంటున్నారు.మరోవైపు, సమర్థులైన నాయకులు పార్టీ వదిలిపోయినా.. ఉన్న నాయకులతోనే ఏదోలా నెట్టుకురావాలని యత్నిస్తున్నారు. పదిలోపు స్థానాలలోనైనా తమ ఉనికిని తెలపాలని ఉవ్విళ్లూరుతున్నారు. గెలుపు మాటెలా ఉన్నా.. గెలుపు-ఓటమిలను ప్రభావితం చేయగల సత్తా పోగుచేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తు లేదని తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గుడ్ బై చెప్పేశారు. త్వరలోనే ఆయన టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు. ఇప్పుడు ఆయన బాటలోని మరికొందరు కాంగ్రెస్ నేతలు సైకిల్ ఎక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిలో నల్లారి కిరణ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరి రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే చర్చలు కూడా ముగిశాయని సమాచారం. సీఎం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. రాజంపేట పార్లమెంటుకు వైసీపీ నేత మిథున్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి ఇచ్చింది టీడీపీ. దగ్గుబాటి పురందేశ్వరి అక్కడ పోటీ చేసి ఓడిపోయారు.