యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీని మరోసారి గద్దెనెక్కనీయకూడదని ప్రధాన ప్రతిపక్షం భావిస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో ఎత్తులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో సీట్లు తక్కువొచ్చినా.. ఓట్ల శాతం మాత్రం వైసీపీకి మెరుగ్గానే వచ్చింది. ఇప్పుడు ఆ శాతాన్ని పెంచుకుని, అధికారాన్ని చేపట్టాలని ఆ పార్టీ అనుకుంటోంది. 2004 ఎన్నికలకు ముందు తన తండ్రి చేసిన పాదయాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, జగన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసంకల్పయాత్ర పేరిట పాదయాత్ర చేశారు. ఇది వైసీపీకి ప్లస్ అవుతుందని భావించినా.. ఆ ఆశలన్నీ తలకిందులయ్యాయి. పద్నాలుగు నెలల పాటు సాగిన పాదయాత్రలో ప్రజలకు పలు హామీలు ఇచ్చుకుంటూనే సాగారు. అయితే, వారిలో భరోసా కల్పించడంలో మాత్రం జగన్ విఫలమయ్యారనే టాక్ వినిపిస్తోంది. దీని తర్వాత అభ్యర్థుల ఎంపికపై బాగా ఫోకస్ చేశారు. అందుకే ప్రస్తుతం పార్టీ వ్యవహారాలను పక్కనపెట్టి, గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో బిజీ అయిపోయాడు. ఈ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చిందని, కొద్దిరోజుల్లో అభ్యర్థుల ప్రకటన కూడా చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది.ఇలాంటి సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోనే కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల సర్వేలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆ పార్టీకి చెందిన నేతలు సర్వే బృందాలు కనిపిస్తే వారిపై దాడులు చేయడం.. పోలీసులకు అప్పగించడం వంటివి చేస్తున్నారు. రాష్ట్రంలోని వైసీపీకి చెందిన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని అనుకోవడమే దీనికి ప్రధాన కారణం. జగన్ కూడా ఇదే విషయంపై పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. పాదయాత్ర చేసిన సమయంలోనూ చాలా సభల్లో జగన్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు దీనిపైనే పోరాటం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇందుకోసం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసేందుకు పార్టీకి చెందిన మాజీ ఎంపీలు, ముఖ్య నేతలతో కలిసి ఆయన ఢిల్లీలో వెళ్లారు. ఓటర్ల జాబితాలో పెద్దఎత్తున చోటుచేసుకున్న అవకతవకలు, అక్రమంగా పేర్ల తొలగింపు అంశాలతోపాటు రాష్ట్ర డీజీపీ వ్యవహారశైలిపైనా సీఈసీకి ఫిర్యాదు చేశారని సమాచారం.