YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తెలుగుదేశంలోకి క్యూ కడుతున్న నేతలు

 తెలుగుదేశంలోకి క్యూ కడుతున్న నేతలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ ఎన్నికల హడావిడి ఊపందుకుంటోంది. ఊహించని రీతిలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గద్దె మీద కూర్చోవాలని అధికార, ప్రతిపక్షాలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ టీడీపీ వైపే ఇతర పార్టీ నేతల చూపు పడుతుండటం గమనించవచ్చు. ఇప్పటికే చాలా మంది సీనియర్ నేతలు టీడీపీ గూటికి చేరుతుండగా.. తాజాగా ఆ లిస్టులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేరు వినిపిస్తుండటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఏపీలో టీడీపీతో కాంగ్రెస్ కి ఎన్నికల పొత్తులేదని ఇటీవల వచ్చిన ప్రకటనే కాంగ్రెస్ నేతలను టీడీపీలోకి వచ్చేలా చేస్తోందని అంటున్నారు.ఆయనే వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్. కాంగ్రెస్ పార్టీతో ఏళ్ల అనుబంధం ఉన్న ఆయన కాంగ్రెస్ లో కీలక నేతగా పేరొందారు. కాంగ్రెస్ పార్టీ తరపున కోట్ల కుటుంబం లాగానే వైరిచర్ల కుటుంబానికి కూడా ఆ పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉంది. ఐదు సార్లు లోక్‌సభ ఎంపీగా పనిచేసిన వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్.. రాజ్య సభ సభ్యునిగా, కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. తాజాగా ఈయన కాంగ్రెస్ వీడి టీడీపీలోకి రావాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు కురుపాం కోటలో ఆయన అనుచరులతో సమావేశం అయి అనంతరం తన నిర్ణయాన్ని మీడియా ముందు తెలపనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడానికి అన్నీ సిద్ధం చేసుకున్నారని తెలుస్తుండగా.. ఇప్పుడు మరో మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నాడనే వార్త టీడీపీకి బాగా అనుకూలించే అంశమే. కొద్దీ రోజులుగా కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉంటుంది బాబు.. కాంగ్రెస్ నేతలను తన పార్టీలో ఎలా చేర్చుకుంటున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే చేరికల విషయంలో రాహుల్, బాబు ఒక నిర్ణయానికి వచ్చాకే నిర్ణయం తీసుకుంటున్నారని టీడీపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏదిఏమైనా ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ తరుణంలో ఇతర పార్టీల సీనియర్ నేతలు టీడీపీ వైపు అడుగులేస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. మున్ముందు ఇంకా చాలామంది సీనియర్ పొలిటీషియన్స్ టీడీపీలోకి రానున్నారని తెలుస్తోంది. ఇదే జరిగితే ఇక ప్రత్యర్థి పార్టీలకు చుక్కలే..!

Related Posts