యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తిరుమల శ్రీవారి దర్శనార్థం వేసవిలో విచ్చేసే లక్షలాదిమంది భక్తులకు నీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని టిటిడి ఈవో అనిల్కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం ఉదయం సీనియర్ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రాబోవు వేసవిలో తిరుమలలోని అన్ని ప్రాంతాలలో భక్తులకు అవసరమైన నీటి సరఫరాచేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని టిటిడి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సర్వదర్శనం క్యూలైన్లలో ప్రవేశ మార్గాలలో వారికి శ్రీవారి దర్శన సమయాన్ని తేలుసుకునేందుకు వీలుగా డిస్ప్లే బోర్డులు, ఎప్పటికప్పుడు ప్రకటనల ద్వారా తెలియజేయాలన్నారు. తిరుమలలోని క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని భక్తులకు వారికి దర్శన సమయం, అన్నప్రసాదాలు పంపిణి, లడ్డూ ప్రసాదాలు తదితర సమాచారాన్ని అందించేలా అన్ని విభాగాల సిబ్బందితో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తద్వారా భక్తులు క్యూలైన్ ఆరంభంలోనే తమకు ఎన్ని గంటలలోపు దర్శనం అవుతుందో ముందస్తుగానే తెలిసే అవకాశం ఉంటుదన్నారు.
తిరుమలలోని ఎస్వి మ్యూజియంను దశల వారిగా అభివృద్ధిచేయాలన్నారు. అదేవిధంగా తిరుపతిలోని మ్యూజియంను చారిత్రక సంపదగా తీర్చిదిద్ధాలని, తిరుచానూరు వద్ద నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పద్మావతి వసతి సమూదాయంలో భక్తులను ఆకట్టుకునేలా చిన్నపాటి మ్యూజియం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో టిటిడి కల్యాణమండపాలను భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకునే సౌలభ్యం కల్పించామని, అదేతరహలో ఇతర ప్రాంతాలలోని కల్యాణ మండపాలను బుక్ చేసుకునేందుకు వీలుగా ఆన్లైన్ అప్లికేషన్ రూపొందించాలన్నారు. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ధర్మ ప్రచార మండలి, భజన మండలి సభ్యులు తమ పేర్లు, కార్యక్రమాలను నమోదు చేసుకునేందుకు వీలుగా ఆన్లైన్ అప్లికేషన్ రూపొందించాలన్నారు.
టిటిడి స్థానిక ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక అధికారులుగా నియమించిన టిటిడి సీనియర్ అధికారులు తరచు సంబంధిత ఆలయాలను సందర్శించి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు మెరుగుపడేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. టిటిడి స్థానిక ఆలయాలలో సిసిటివిలు ఏర్పాటు చేసి, భద్రత మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. భక్తులు వేసవిలో ఎండకు, వర్షానికి ఇబ్బందిలేకుండా అలిపిరి, శ్రీవారి మెట్టు నడకదారిలో, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెలుపల ఉన్న మార్గాలలో షెల్టర్లను సౌకర్యవంతంగా ఏర్పాటు చేయాలన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు పంపీణి జరుగుతున్న ప్రాంతంలో భక్తులకు ఇబ్బంది లేకుండా సివిల్ పనులను త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.