యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ప్రజల వ్యక్తిగత భద్రతపై వారి ఆలోచన విధానం లో మార్పు రావాలని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ పేర్కొన్నారు. జాతీయ భద్రత వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో హెల్మెట్ వాడకంపై జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ అధ్యక్షతన వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ జి .రాజేశం గౌడ్, జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ, జగిత్యాల, కోరుట్ల, చొప్పదండి నియోజకవర్గాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, కె .విద్యాసాగర్ రావు,సుంకె రవి శంకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కె .శేఖర్ రావు, స్థానిక మున్సిపల్ చైర్మన్ టి. విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి కిషన్ రావు, అడిషనల్ ఎస్పీ మురళీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుప్పాల శ్రీధర్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రతి ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం హెల్మెట్ ధరించడం పై ఇలాంటి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కేవలం ఒక్క పోలీస్ శాఖనే కాకుండా ఇందులో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసినప్పుడే అవగాహన కార్యక్రమాలు విజయవంత మవుతాయని పేర్కొన్నారు. గత సంవత్సరంలో దేశంలో జరిగిన పలు రోడ్డు ప్రమాదాల సంఘటనలలో లక్షకు పైగా మృత్యువాత పడ్డారని, అదేవిధంగా లక్షల మంది ప్రమాదాల బారిన పడి వికలాంగుల అయ్యారని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా నైతే వినియోగించుకుంటున్నారో, అదే తరహాలో ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ తో ఆర్థిక భారం మోపుతున్నారని ఆవేదన చెందకుండా , తమ భద్రతా దృష్ట్యా మాత్రమే ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేస్తున్నారని అర్థం చేసుకోవాలని సూచించారు. తమపై కుటుంబాల భద్రత, పోషణ ఆధారపడి ఉందనే విషయాన్ని గుర్తించి హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల బారి నుండి తప్పించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా కళాకారులు పాటలను ఆలపించారు. అనంతరం హెల్మెట్ ధారణ తో జిల్లా కేంద్రంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు.