YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

విజయవాడలో రూ.  650 కోట్ల తో "ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌"  

Highlights

  • శాశ్వత అవసరాల కోసం మరో  టెర్మినల్‌ కు  శ్రీకారం
  • మెగా విస్తరణ దిశగా విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు
  • ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ నిర్మాణానికి పీఎంసీని నియమించిన కేంద్రం
  • పీఎంసీగా ‘స్టుప్‌’ ఎంపిక
విజయవాడలో  రూ.  650 కోట్ల తో  "ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌"  

అమరావతి రాజధాని ప్రాంతానికి మణిమకుటమైన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి శాశ్వత ప్రాతిపదికన టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఏడాది కిందట అందుబాటులోకి వచ్చిన నూతన ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ పక్కనే కేసరపల్లి వైపు ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు స్థలాన్ని ఎయిర్‌పోర్టు అధికారులు ప్రతిపాదించారు. బిల్డింగ్‌ నిర్మాణానికి ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ (పీఎంసీ)కి టెండర్లు పిలిచి ‘స్టుప్‌’ అనే సంస్థను కేంద్రం ఎంపిక చేసింది.
 అమరావతి రాజధాని ప్రాంతానికి మణిమకుటమైన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి శాశ్వత ప్రాతిపదికన టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి కేంద్రం.. ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ (పీఎంసీ)ని నియమించటంతో అంతర్జాతీయ హోదాకు ముందు, తర్వాత అభివృద్ధి పనులతో శరవేగంగా రూపుమార్చుకుంటున్న విజయవాడ ఎయిర్‌పోర్టు... మెగా విస్తరణ దిశగా అడుగులు వేయబోతోంది. ఏడాది కిందట అందుబాటులోకి వచ్చిన నూతన ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ పక్కనే కేసరపల్లి వైపు ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు స్థలాన్ని ఎయిర్‌పోర్టు అధికారులు ప్రతిపాదించారు. ప్రస్తుత ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ ఓ పదిహేను సంవత్సరాల పాటు అవసరాలను తీర్చగలుగుతుంది. గత అర దశాబ్ద కాలంగా అనూహ్యంగా విమాన ప్రయాణికులు, విమానాల రాకపోకలతో దేశంలోని మెట్రోపాలిటన్‌ ఎయిర్‌పోర్టుల కంటే అధికంగా వృద్ధి రేటు సాధిస్తున్న విజయవాడ ఎయిర్‌పోర్టు ఈ ఏడాదిలో అనూహ్యంగా దినదిన ప్రవర్థమానం చెందుతూ వస్తోంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో 8లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా ఈ ఏడాది ‘మిలియన్‌ మార్చి’ నినాదంతో పది లక్షల మంది రాకపోకలు సాగించే దిశగా ఇక్కడి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఫలితంగా 21 నుంచి ప్రస్తుతం 33 విమానాల ఆపరేషన్‌ పెరిగింది. ఈ ఏడాదిలోనే ఢిల్లీకి మూడవ సర్వీసును ఎయిర్‌ ఇండియా ప్రవేశపెట్టింది. ఇటీవలే ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ముంబాయికి విమాన సర్వీసును ప్రారంభించింది. మార్చి 2 నుంచి హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుకు ఇండిగో సంస్థ సర్వీసులను ప్రారంభించబోతోంది. మార్చి ఒకటి నుంచి ట్రూజెట్‌ సంస్థ కడపకు విమాన సర్వీసును ప్రారంభించబోతోంది. మరో ఆరు నెలల్లో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ ప్రెస్‌ ఇక్కడి నుంచి విదే శాలకు అంటే షార్జా, దుబాయ్‌లకు విమాన సర్వీసులు నడపటానికి ప్రణాళికలు రూపొందించుకుంది. ఇండిగో కూడా దేశంలోని ఢిల్లీతో పాటు జైపూర్‌, కలకత్తా వంటి నగరాలకు కూడా విమాన సర్వీసులు నడపాలని, గల్ఫ్‌ దేశాలకు కూడా విమాన సర్వీసులు నడపాలన్న ఆలోచనతో ఇండిగో ఉంది. ఇటీవల ప్రారంభించిన ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ ప్రస్తుతం 1000 మంది విమాన ప్రయాణికులు ఒకేసారి రాకపోకలు సాగించటానికి వీలుగా అవసరాలను తీరుస్తోంది. అంతర్జాతీయ విమాన సర్వీసుల కోసం మరోవైపు పాత టెర్మినల్‌ను ఆధునికీకరించి అంతర్జాతీయ టెర్మినల్‌గా ఉపయోగించబోతున్నారు. ఈ టెర్మినల్‌ బిల్డింగ్‌ 750 మంది ప్రయాణికుల రాకపోకలకు ఒకేసారి అవకాశం కల్పించనుంది. ప్రస్తుత ఎయిర్‌ ట్రాఫిక్‌ను చూస్తే అంచనాలను మించుతోంది. ఈ క్రమంలో ఎప్పుడో పదేళ్ళ తర్వాత అనుకుంటున్న ట్రాఫిక్‌ సమీప కాలంలోనే కనిపించే పరిస్థితి కనిపిస్తోంది. గత కొంత కాలంగా విమానాశ్రయం సాధిస్తున్న ప్రగతిని దృష్టిలో ఉంచుకుని ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు ఎప్పుడో కాకుండా ముందుగానే శ్రీకారం చుడితే మంచిదన్న అభిప్రాయాన్ని ఏఏఐ అధికారుల దగ్గర వ్యక్తం చేశారు. ఏఏఐ అధికారులు వెంటనే ఇక్కడి ఎయిర్‌పోర్టు అధికారులకు తగిన ప్రతిపాదనలు పంపించమని కోరారు. దీనికి అనుగుణంగా విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనరావు రూ.650 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు చేసి ఢిల్లీకి పంపారు. కేంద్రం దగ్గర చాలా కాలం ఇది పెండింగ్‌లో ఉంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రి అశోక్‌ గజపతిరాజుల కృషితో ఎట్టకేలకు కేంద్ర స్థాయిలో దీనిపై కదలిక వచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ (పీఎంసీ)కి టెండర్లు పిలిచింది.

ఈ టెండర్లలో ‘స్టుప్‌’ అనే సంస్థను కేంద్రం ఎంపిక చేసింది. ఈ సంస్థకు అవార్డు ఇవ్వటానికి కొంత సమయం పడుతుంది. అవార్డు రాగానే ఈ సంస్థ తన పని ప్రారంభిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ వ్యవహారాలన్నీ ఈ సంస్థ పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. టెర్మినల్‌ బిల్డింగ్‌ డిజైన్స్‌ అన్నింటినీ ఈ సంస్థే రూపొందిస్తుంది. డిజైన్స్‌తో పాటు అరైవల్‌, డిపార్చర్‌ బ్లాక్స్‌లో ఇంటీరియర్‌ డిజైన్స్‌, లాంజ్‌ డిజైన్స్‌ కూడా ఈ సంస్థ నిర్ణయిస్తుంది. వీటితో పాటు ఏరో బ్రిడ్జిల డిజైన్స్‌ అంతర్గతంగా కమర్షియల్‌ ప్రాంతాన్ని, బయట ల్యాండ్‌ స్కేపింగ్‌, అవుట్‌లుక్‌ డిజైన్స్‌ అన్నీ ఈ సంస్థ రూపొందిస్తుంది. టెర్మినల్‌ బిల్డింగ్‌కు అయ్యే అంచనాలను కూడా ఈ సంస్థ సిద్ధం చేస్తుంది. టెండర్ల ప్రక్రియను కూడా ఈ సంస్థ చేపడుతుంది. నిర్మాణ పనులను పర్యవేక్షించటంతో పాటు తర్వాత రెండు సంవత్సరాల పాటు ఆజమాయిషీ కూడా ఈ సంస్థ చేస్తుంది.


 

Related Posts