యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రశ్నిస్తానని జనసేన పార్టీని స్థాపించారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. 2014 ఎన్నికల కంటే ముందే పార్టీని ఏర్పాటు చేసినా.. అప్పుడు పోటీకి దూరంగా ఉన్నారు. అంతేకాదు, ఆ ఎన్నికల్లో తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపారు. గత సంవత్సరం జరిగిన జనసేన నాల్గవ ఆవిర్భావ సభ నుంచి పవన్.. టీడీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో పవన్ స్పీడు పెంచేశారు. ఎన్నికల కోసం ఆయన ప్రచార ప్రక్రియను ప్రారంభించారు. సోషల్ మీడియా సాయంతో ఆ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు స్థానిక నాయకులు శ్రీకారం చుట్టారు. ప్రచార రథాలను సైతం సిద్ధం చేశారు. మరోవైపు, జనసేన పార్టీ విధానాలు, నినాదాలు, లక్ష్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ఆ పార్టీ ఏకంగా సాంస్కృతిక శాఖను ఏర్పాటు చేసుకుంది. ఈ శాఖ జనసేన నినాదాలను తయారు చేసి కార్యకర్తల ద్వారా వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్తుంది. అదేవిధంగా పవన్ మాటలు, పాటలను మిక్స్ చేసి వాటిని అన్ని గ్రామాల్లో ప్రచారం చేసే కార్యక్రమానికి ఈ శాఖ ఇప్పటికే శ్రీకారం చుట్టింది.మరోవైపు ఈ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండడంతో ముక్కోణ పోటీ జరిగే అవకాశాలు ఉన్న నియోజకవర్గాలను ఎట్టి పరిస్థితుల్లో వదలుకోకూడదని ఆ పార్టీ భావిస్తోంది. మెజారిటీ స్థానాలు సాధిస్తే.. ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించవచ్చనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. మరోవైపు, లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని జనసేనాని పట్టుదలతో ఉన్నారు. అందుకోసం ఆయన రాష్ట్రంలోని 25 పార్లమెంట్ స్థానాల్లో ఏడింటిని బాగా టార్గెట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ.. పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం.. విశాఖపట్నం.. కృష్ణా జిల్లాలోని విజయవాడ.. గుంటూరు.. కర్నూలు పైన పేర్కొన్న ఏడు స్థానాలని సమాచారం. వీటిలో గుంటూరు ఒక్క స్థానానికే అభ్యర్థిని ప్రకటించిన పవన్.. మిగిలిన ఆరింటికి కూడా బలమైన వారిని నిలబెట్టాలని అనుకుంటున్నారట. వీటి కోసం సొంత ఇమేజ్‌తో ఓట్లు సంపాదించుకునే సామర్థ్యం ఉన్న నేతల కోసం జనసేన నేతలు అన్వేషణ కొనసాగిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.