యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (వర్కింగ్ టైటిల్)కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై ఇప్పటికే బోలెడన్ని రూమర్లు, వార్తలు వచ్చాయి. అయితే, ఈ మధ్య కాలంలో వచ్చిన వార్తలను బట్టి భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందు అంటే 1940 బ్యాక్ డ్రాప్‌లో RRR కథ ఉంటుందని సమాచారం. ఎన్టీఆర్ ఒక బందిపోటుగా కనిపిస్తారని, రామ్ చరణ్ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో అధికారిగా ఉంటారని టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా కథపై మరో రూమర్ వినిపిస్తోంది. 1940ల కాలంలో సినిమా కథ ప్రారంభం కావడం వాస్తవమేనని.. అయితే, అప్పట్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ స్నేహితులుగా.. 2019లో అన్నదమ్ములుగా కనిపిస్తారని అంటున్నారు. అంటే, ఈ సినిమాలో ‘మగధీర’ రాజమౌళి మాదిరిగా రెండు జన్మలను చూపించనున్నారన్న మాట. మరి, ఈ రెండు జన్మల కనెక్షన్ ఎలా కుదురుతుంది అనేది సినిమాలోనే చూడాలని అంటున్నారు. ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ.. రెండు జన్మలు, రెండు కాలాల్లో ఈ ఇద్దరు హీరోలు ఎలా ఉండబోతున్నారనే ఆత్రుత ప్రేక్షకుల్లో ఉండటం ఖాయం. ఈ సినిమా ఫస్ట్‌లుక్కో, టీజరో వస్తే కానీ.. ఈ రూమర్లకు అడ్డుకట్టవేయలేం. ప్రస్తుతం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ శివారులో RRR షూటింగ్ జరుగుతోంది. ఈ రెండో షెడ్యూల్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో పాటు సముద్రఖని కూడా పాల్గొంటున్నారని సమాచారం. యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని రాజమౌళి ఆస్థాన కెమెరా మెన్ సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.