యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అచ్చెన్న… అదరగొడుతున్నారు.. తన స్టయిల్.. పంచ్ లతో దుమ్మురేపుతున్నారు. వచ్చే ఎన్నికలలో శ్రీకాకుళం జిల్లాలో తిరిగి తెలుగుదేశం జెండాను ఎగురవేసి తానే మళ్లీ మంత్రిని అవ్వాలనుకుంటున్నారు. అందుకోసం తాను ప్రాతినిధ్యం వహించే టెక్కలి నియోజకవర్గమే కాకుండా పలు నియోజకవర్గాలపై పట్టు సాధించేందుకు అచ్చెన్న ప్రయత్నాలు ప్రారంభించారు. మంత్రిగా తన మాటనే అధికారులు వినాలని, తాను చెప్పిన పనే చేయాలని అచ్చెన్న శాసిస్తుండటంతో ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా అచ్చెన్న వైపు చూస్తున్నారు. అచ్చెన్న మళ్లీ టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. అందుకోసం ఆయన నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు.ఇటీవల కాలంలో అచ్చెన్నాయుడు రాటుదేలిపోయారు. ప్రజలను ఆకట్టుకునే విధంగా ఆయన దూసుకెళుతున్నారు. అచ్చెన్నాయుడు గతంలో హరిశ్చంద్రాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి అనుభవం, తన సోదరుడు ఎర్రన్నాయుడు జిల్లా రాజకీయాలను శాసించిన తీరును దగ్గరుండి చూసిన అచ్చెన్నాయుడు ఇప్పుడు అన్న దారిలోనే ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నారు. నిన్న మొన్నటి వరకూ అచ్చెన్నాయుడు పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. అయితే జగన్ పాదయాత్ర ముగిసిన తర్వాత నుంచి ఆయన జిల్లాలోనే ఎక్కువగా గడుపుతున్నారు. జిల్లా పై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.అచ్చెన్నాయుడు కేవలం టెక్కలి నియోజకవర్గంపైనే దృష్టి పెట్టలేదు. ఇచ్ఛాపురం, పాతపట్నం, శ్రీకాకుళం, టెక్కలి, నరసన్న పేట నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక్కడి అభ్యర్థుల గెలుపు బాధ్యతలను తానే భుజానకెత్తుకున్నారు. అందుకోసమే టెక్కలి నియోజకవర్గం లాగా మిగిలిన నియోజకవర్గాలను కూడా తీర్చి దిద్దుతానని తన ప్రసంగాల్లో చెబుతున్నారు. మంత్రిగా ఉన్న అచ్చెన్న టెక్కలిని అభివృద్ధి చేశారనే చెప్పాలి. తన నియోజకవర్గంతో పాటు నాలుగు నియోజకవర్గాలను గెలిపించుకుని వస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సయితం అచ్చెన్న హామీ ఇచ్చారట. అందుకోసమే ఆయన విస్తృతంగా ఈ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.కళావెంకట్రావుతో అచ్చెన్నాయుడికి పొసగదన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకోసమే ఎ్చెర్న, ఆముదాలవలస, రాజాం నియోజకవర్గాలను అచ్చెన్నాయుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ పర్యటనకు కూడా దూరంగా ఉంటున్నారు. ఆముదాలవలసలో ప్రభుత్వ విప్ కూన రవికుమార్ నియోజకవర్గం కావడంతో ఆయనకూ కొంత దూరం పాటించాలని అచ్చెన్న నిర్ణయించుకున్నారు. ప్రతిసభలోనూ అచ్చెన్నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తే తానే మంత్రినవుతానని, మీ నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తానని చెబుతుండటం విశేషం. మొత్తం మీద కళా వెంకట్రావుకు పోటీగా అచ్చెన్న తానేంటో నిరూపించుకునేందుకు నాలుగు నియోజకవర్గాల్లో గెలుపును ఛాలెంజ్ గా తీసుకున్నారని చెబుతున్నారు. మరి అచ్చెన్న సక్సెస్ అవుతారా?