యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాల రానున్నందున వంద ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలో ప్రస్తుతం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు, స్విమ్స్ ఉన్నాయి. వీటిల్లో 1900 వరకు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఏలూరు జిల్లా ఆసుపత్రిని బోధనాసుపత్రిగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినందున ప్రభుత్వపరంగా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2వేలకు చేరనుంది.దీనివల్ల ప్రతిభ కలిగిన విద్యార్థులు తక్కువ ఫీజుతో వైద్య విద్యను పూర్తిచేసే అవకాశంతోపాటు ఏలూరు చుట్టుపక్కల వారికి వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. ఏలూరు ఆసుపత్రిలో ప్రస్తుతం 450 వరకు పడకలు ఉన్నాయి. ప్రతిరోజూ ఓపీ విభాగంలో 1500 మంది రోగులు వైద్య సేవలు పొందుతున్నారు.బోధనాసుపత్రిగా మార్చేందుకు కనీసం రూ.260 కోట్ల వరకు వ్యయం అవుతుందని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. తొలివిడతగా త్వరలో రూ.20 కోట్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు. మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా విడుదల చేయనున్నారు. ఈ కళాశాల ఏర్పాటు, నిధుల మంజూరుకు తాజాగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది.ఇందుకనుగుణంగా అధికారిక ఉత్తర్వులు వెలువడిన అనంతరం వైద్య ఆరోగ్యశాఖ జాతీయ వైద్య మండలి(ఎంసీఐ)కి దరఖాస్తు చేస్తుంది. ఎంసీఐ అధికారుల తనిఖీల ప్రక్రియ పూర్తయ్యాక తరగతుల నిర్వహణకు ఆమోదం తెలియజేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం 2020 విద్యా సంవత్సరం లోనే ఇక్కడ తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.