YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

‘కాలాత్మక పరమేశ్వర రామ’

‘కాలాత్మక పరమేశ్వర రామ’

యువ్ న్యూస్ కల్చరల్ బ్యూరో:

‘కాలాత్మక పరమేశ్వర రామ’ అంటారు తత్త్వజ్ఞులు. పరమేశ్వరుడు కాలాత్మకుడు. కాలాత్మకుడు శ్రీరామ చంద్రుడు. మానవుడు కాలజ్ఞానం ద్వారా కూడా పరమేశ్వరారాధన చేయవచ్చని ఆ వాక్యంలోని అంతరార్థం. నిమేషం మొదలుకొని సంవత్సరం వరకు పదకొండు కాల విభాగాలను భారతీయులు గుర్తించారు. అందులో ‘మాసం’ ఒకటి. మఘానక్షత్రంతో కలసి ఉన్న పూర్ణిమ గల కాల ప్రమాణాన్ని ‘మాఘం’ అంటారు.  నిజానికి ఏ మాసం ప్రత్యేకత ఆ మాసానిదే.
అశ్విని మొదలైన నక్షత్రాల వరుసలో మఘ పదవది. ఏదో ఒక నిమిత్తాన్ని సంభావించి దైవజ్ఞులు అనేక దినాలను పర్వదినాలుగా నిర్దేశించారు. అది నిమిత్తంగా చేసుకొని సర్వమూ తానయైన పరమాత్మను యథాశక్తి అర్చించి త్రికరణశుద్ధిని సాధించాలని వారి ఉద్దేశ్యం. మాఘమాసంలో అటువంటి పర్వదినాలు చాలానే ఉన్నాయి. శ్రీపంచమి, రథసప్తమి, భీష్మాష్టమి, మాఘపూర్ణిమ, మహాశివరాత్రి అనేవి మరింత వైశిష్ట్యం కలవి. సూక్ష్మ దృష్టితో ఆలోచిస్తే శ్రీపంచమి సరస్వతీ ఆరాధనకు ప్రధానంగా, సంబంధించినది. సరస్వతీదేవి అంటే జ్ఞానశక్తి. అది అంబికాతత్త్వానికి సంకేతం. రథసప్తమి సూర్యనారాయణ రూప పరమాత్మను దృష్టిలో ఉంచుకుని ఏర్పడింది. అంటే అది విష్ణు తత్త్వానికీ, ఆదిత్య తత్త్వానికీ సంబంధించినది. మాఘ పూర్ణిమ విశిష్టతను గూర్చి ఆంద్ర శేషగిరి రావుగారు ‘పండుగలు – పరమార్థాలు’ అనే గ్రంథంలో ఇచ్చిన వివరాలను గమనిస్తే అదంతా జలాధిదేవతకు సంబంధించిన విశేషాంశంగా కనిపిస్తున్నది. దాని ఉప లక్షణంగా తీసుకుని మాఘపూర్ణిమ పంచభూతాల సమాహార రూపార్చన పరమైనది అనుకుంటే అది గణపతి తత్త్వానికి సంకేతంగా నిలుస్తుంది.
ఇంక మహాశివరాత్రి. మాఘ బహుళ చతుర్దశినాడు ఇంచుమించుగా భారతదేశమంతా ఈ పర్వాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించుకుంటుంది. శివుడు లింగరూపంలో ఆవిర్భవించిన మహాపర్వం ఇది. ఇది మహాదేవారాధనకు సంబంధించిన విశిష్ట దినం.
ఇలా మాఘమాసం పంచాయతన ఆరాధనతో నిలువెల్లా పులకరింపజేసే కాలవిభాగం.
ఇందులో శ్రీ పంచమి జ్ఞానశక్తికి చెందినదనుకున్నాం కనుక, రథ సప్తమి క్రియాశక్తికి చెందినదిగా, మహాశివరాత్రి ఇచ్ఛాశక్తికి చెందినదిగా భావిస్తే మాఘమాసం శక్తిత్రయాత్మక స్వరూపంగా మానవులను పరమాత్మాభిముఖంగా పయనించటానికి పరికొల్పుతున్నదనే స్ఫురణ కలుగుతున్నది.
మాఘంతో శిశిరర్తువు ప్రారంభం అవుతుంది. చలిచేత దేహాన్ని కుచించుకుపోయేటట్లు చేసేది అని శిశిర శబ్దానికి నిరుక్తి. తరువాతిదైన వసంతం మళ్ళీ ఆ కుంచించుకుపోయిన దేహాన్ని సుస్థితికి తెస్తుంది. అంటే శిశిరర్తువు కాలచక్రంలో ముగింపు దశ. మొదటిదశ మొదలుకొని ముగింపు దశవరకూ వస్తున్న జీవన గమనం పంటకు వచ్చే కాలంగా దీనిని సంభావించాలి. క్రుంగుదల పొందిన దేహాదికమే పొంగుదలను చక్కగా స్వీకరించగలుగుతుంది. అటువంటి స్వీకారానికి  సన్నద్ధం చేసే విశిష్టమాసం మాఘం. ఆయుర్వేద శాస్త్రం విధిస్తున్న కాయకల్ప చికిత్సవంటిది ఈ మాఘమాస వ్యవహారం. ఈ శిశిరర్తువును ఆకులు రాలే కాలం అంటారు. ఆకులు రాలటం ఎంత సమగ్రంగా జరుగుతుందో చెట్లు చిగురించే ప్రక్రియ తర్వాతి ఋతువులో అంత పటిష్ఠంగా జరుగుతుంది. అటువంటి మహోదాత్త ఫలాన్ని ప్రాణికోటికి అందించడానికి ప్రకృతిని సన్నద్ధం చేసే గొప్ప కాలం మాఘమాసం.

ప్రకృతికాంత పాతచీరను తీసివేసి చిత్రవిచిత్ర వర్ణమయమైన క్రొత్తచీరను ధరించి దివ్య కాంతులతో ప్రకాశించడానికి వీలు కల్పించే ఉదాత్తలక్ష్యం గల కాలం మాఘమాసం. అందువలనే ఈ మాసలక్ష్మి మహాశివరాత్రి పర్వం ముగింపుతో, తర్వాతి వసంత లక్ష్మికి స్వాగతం చెబుతున్నది. మహాశివుడు లయకారుడు. ఆ విధంగా మాఘమాసం పునఃసృష్టికి ద్వారప్రాయం అవుతూ గొప్ప త్యాగశీలం కలదిగా గణనకు వస్తుంది.

Related Posts