యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సీబీఐపై యుద్ధం ప్రకటించిన పశ్చిమబంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. శారదా కుంభకోణం కేసులో కోల్‌కతా పోలీసు కమిషనర్ సీబీఐ విచారణకు హాజరుకావాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం మంగళవారం ఆదేశాలిచ్చింది. శారదా కుంభకోణంలో సిట్ చీఫ్‌గా ఉన్న రాజీవ్‌కుమార్‌ను విచారించేందుకు ఆదివారం కోల్‌కతా వచ్చిన సీబీఐ అధికారులను బెంగాల్ పోలీసులు అడ్డుకోవడం, సీబీఐ తీరును నిరసిస్తూ మమతా బెనర్జీ నడిరోడ్డుపైనే దీక్షకు దిగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. విచారణకు వచ్చిన తమ అధికారులను అడ్డుకుని అరెస్ట్ చేయడంపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టులో బెంగాల్ ప్రభుత్వం, సీబీఐ తమ వాదనలు కోర్టుకు వినిపించాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం రాజీవ్‌కుమార్‌ను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చింది. అయితే ఆయన్ని అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పును మమతా బెనర్జీ స్వీకరించారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పు ప్రజా విజయమని పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తును తామెప్పుడూ అడ్డుకోలేదని.. వారు వ్యవహరించిన తీరుపైనే అభ్యంతరం తెలిపామని చెప్పారు. మోదీ, అమిత్ షా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారారని, తమ యుద్ధం బీజేపీపైనేనని స్పష్టం చేశారు.