యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
భారత్ జట్టులో సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ ‘బ్రదర్స్’ ఆడబోతున్నారు. అప్పట్లో మోహిందర్ అమరనాథ్, సురీందర్ అమరనాథ్.. ఆ తర్వాత ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరఫున మైదానంలో మెరిశారు. మళ్లీ ఇన్నాళ్లకి హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య రూపంలో ‘బ్రదర్స్’ సందడి చేయనున్నారు. న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి తొలి టీ20 మ్యాచ్ ప్రారంభంకానుండగా.. జట్టులోకి హార్దిక్, కృనాల్ ఎంపికైన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో గత మూడేళ్లుగా ముంబయి ఇండియన్స్ తరఫున ఈ పాండ్యా బ్రదర్స్ ఆడుతున్నారు. కానీ.. భారత్ తరఫున ఇద్దరూ కలిసి ఆడబోతుండటం ఇదే తొలిసారి..!
కృనాల్ కంటే హార్దిక్ పాండ్య రెండేళ్లు చిన్నవాడైనప్పటికీ అతని కంటే ముందే టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు. 2016, జనవరి 26న ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌తో భారత్ జట్టులోకి హార్దిక్ పాండ్య ఎంట్రీ ఇవ్వగా.. కృనాల్ పాండ్య గత ఏడాది నవంబరు 4న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. వాస్తవానికి ఇంగ్లాండ్‌తో గత ఏడాది జరిగిన టీ20 సిరీస్‌లోనే ఇద్దరూ కలిసి ఆడాల్సింది. కానీ.. ఆ సిరీస్‌కి కృనాల్ ఎంపికైనా.. తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఇటీవల గాయం, ఆ తర్వాత సస్పెన్షన్‌తో ఒకింత ఒత్తిడికి గురైన హార్దిక్ పాండ్య గత ఆదివారం న్యూజిలాండ్‌తో ముగిసిన ఆఖరి వన్డే మ్యాచ్‌లో బ్యాట్, బంతితోనూ రాణించి మళ్లీ లయ అందుకున్నాడు. మరోవైపు కృనాల్ పాండ్య కూడా గత నెలలో ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20 సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. దీంతో.. ఇద్దరూ రేపు మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది..!