యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత శబరిమల ఆలయంలోకి 51 మంది మహిళలు ప్రవేశించారని గతంలో ప్రకటించిన కేరళ సర్కారు మాటా మార్చింది. కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే ఆలయంలోకి ప్రవేశించారని సోమవారం శాసనసభలో ప్రకటించింది. శబరిమలలోకి మహిళల ప్రవేశంపై గతేడాది సెప్టెంబరు 28న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు విచారణకు రానున్న నేపథ్యంలో విజయన్ ప్రభుత్వం ప్రకటన చర్చనీయాంశమైంది. దేవాలయ కార్యనిర్వాహక అధికారి సమర్పించిన నివేదికలో ఇద్దరు మహిళలు మాత్రమే ఆలయంలోకి ప్రవేశించనట్టు పేర్కొన్నారని శాసనసభలో దేవాదాయ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ వెల్లడించారు. ఆలయంలోకి ప్రవేశించిన మహిళల వివరాలు అందజేయాలని గతంలో విపక్ష సభ్యులు కోరినా, ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. ఈవో అందజేసిన నివేదికలో బిందు, కనకదుర్గ పేర్లను మాత్రమే ప్రస్తావించారు. జనవరి 2న భారీ పోలీసు భద్రత నడుమ ఈ ఇద్దరు మహిళలు సన్నిధానంలోకి ప్రవేశించారని తెలిపారు. ఈ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత శ్రీలంకకు చెందిన శశికళ (48) అనే మహిళ శబరిమలలోకి ప్రవేశించినట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించినా, ఈ నివేదికలో మాత్రం ఆమె పేరు లేదు. జనవరి 18న సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో సెప్టెంబరు 28 నుంచి 51 మంది మహిళలు ఆలయంలోకి ప్రవేశించినట్టు విజయన్ సర్కారు తెలిపింది. అయితే, వీరిలో 50 ఏళ్లు పైబడిన మహిళలు సైతం ఉన్నారని, అలాగే కొంతమంది పురుషులు పేర్లూ ఇందులో ఉన్నాయని కొద్ది రోజుల తర్వాత ప్రకటించింది. అంతేకాదు, ఈ జాబితా నుంచి బలవంతంగా 34 మంది పేర్లను తొలిగించిన కమ్యూనిస్ట్ ప్రభుత్వం, ఈ గందరగోళం ఎందుకు ఏర్పడిందో విచారణ జరిపించాలని డీజీపీని ఆదేశించింది. కేరళ ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడంతో విపక్ష కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సర్వోన్నత న్యాయస్థానానికి నకిలీ నివేదిక ఇచ్చి, తప్పుదోవ పట్టించిందని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్న 51 మందిలో కేరళకు చెందిన మహిళ ఒక్కరూ లేకపోగా, తమిళనాడుకు చెందిన 24 మంది పేర్లను చేర్చారు. అలాగే, ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన దాసరి పద్మావతి పేరు ముందు వరుసలో ఉంది. వాస్తవానికి ఆమె వయసు 55 ఏళ్లు కాగా, జాబితాలో 48గా పేర్కొన్నారు. దీనిపై శబరిమల కర్మ సమితి, పలు హిందూ సంస్థలు మండిపడ్డాయి. ముఖ్యమంత్రి విజయన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.