యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రతిపక్ష నేతలందరినీ వెనక్కినెట్టి తనను తాను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకునేందుకే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధర్నా పేరుతో డ్రామా నడుపుతున్నారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. సీబీఐకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ ధర్నా చేపట్టడంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికాలో వైద్య చికిత్స తీసుకుంటున్న జైట్లీ.. ట్విటర్ వేదికగా మమతపై విమర్శల వర్షం గుప్పించారు. ‘కుంభకోణం కేసులో కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ వెళ్లడంపై మమతా బెనర్జీ అతిగా స్పందిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే అనేక అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక ఆమె వ్యూహమేంటో? ధర్నాకు ఇతర విపక్ష నేతలను అహ్వానించడంలో అంతరార్థమేంటో? కేవలం పోలీసు అధికారికి అండగా ఉండేందుకే ఆమె ధర్నా చేపట్టారనుకుంటే అది పొరబాటే’ అంటూ జైట్లీ ట్వీట్ చేశారు. అవినీతి పాలకులంతా ఏకమై దేశ పాలనా పగ్గాలను చేజిక్కించుకోవాలని చూస్తున్నారని జైట్లీ దుయ్యబట్టారు. ఇలాంటి సిద్ధాంతాలు లేని సంకీర్ణాలు దేశ భవిష్యత్‌కు విపత్తు లాంటివన్నారు. ఇతర ప్రతిపక్ష నేతలను వెనక్కినెట్టి తనను తాను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకునేందుకే మమతా బెనర్జీ ఈ ధర్నా చేపట్టారని వరస ట్వీట్లలో జైట్లీ ఆరోపించారు. ‘మమతా బెనర్జీ దీక్షకు పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు మద్దతు పలికారు. అందులో చాలా మంది అవినీతి ఆరోపణల కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నవారే. వారంతా ఏకమై దేశ పాలనా పగ్గాలను చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. నవ భారత్‌ను ఇలాంటి అవినీతి నేతల చేతుల్లో పెట్టాలా?’ అని జైట్లీ ప్రశ్నించారు