యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. నేతల మధ్య వాగ్భాణాల వేడితో కార్యకర్తలు సైతం రెచ్చిపోతున్నారు. దీంతో ఎప్పుడేం జరుగుతోందనని పోలీసులు అప్రమతంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా గుంటూరులోని జనసేన కార్యాలయంపై జరిగిన దాడి రాష్ట్రంలో కలకలం రేపింది. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలో నిర్మించిన జనసేన కార్యాలయాన్ని జనవరిలో పవన్‌కళ్యాణ్ ప్రారంభించారు. అర్థరాత్రి ఈ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బీరు బాటిళ్లు విసిరి అద్దాలు పగులగొట్టారు. వారిని అడ్డుకోబోయిన సెక్యూరిటీపై దాడి చేశారు. దీనిపై జనసేన వర్గాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పార్టీ ఆఫీసులో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నారు. తమ కార్యాలయంపై దాడి జరిగిందన్న సమాచారం అందుకున్న జనసేన కార్యకర్తలు పెద్దయెత్తున అక్కడికి చేరుకున్నారు. జనసేన పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే ఇతర పార్టీల వారు ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్నారని జన సైనికులు ఆరోపిస్తున్నారు. పిరికి పందలే ఇలాంటి చర్యలకు పాల్పడతారని విమర్శిస్తున్నారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.