యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
హిందూకుష్ పర్వత శ్రేణుల్లో మూడవ వంతు గ్లేసియర్లు కరిగిపోనున్నాయి. 2100 సంవత్సరం లోగా ఈ పర్వతాల్లోని మంచుకొండలు అడుగంటిపోతాయని ఓ సర్వే హెచ్చరించింది. గ్లోబల్ వార్మింగ్‌ను ఈ శతాబ్ధంలోపు 1.5 సెంటీగ్రేడ్ల వరకు కట్టడి చేసినా.. హిందూకుష్ పర్వతాల్లోని మంచు మూడవ వంతు కరుగుతుందని ఖాట్మాండుకు చెందిన ఐసీఐఎంవోడీ సంస్థ తన నివేదికలో తెలిపింది. హిమాలయాలతో పాటు కరక్కోణం ప్రాంతాల్లో సగటున 0.7 శాతం ఉష్ణోగ్రతలు పెరుగుతాయని సర్వే వెల్లడించింది. టిబెట్ పీఠభూమితో పాటు మధ్యశ్రేణి హిమాలయాలు, కరక్కోణం ప్రాంతాలు హిందుకుష్ కన్నా ఎక్కవ వేడెక్కనున్నాయి. సుమారు 350 పరిశోధకులు, నిపుణులు, విధానకర్తలు హిందూకుష్‌పై ముసాయిదాను తయారు చేశారు. మరో వందేళ్లలో హిందూకుష్లో మంచు కరిగిపోయి, కేవలం కొండప్రాంతంగా మారుతుందని ఆ రిపోర్ట్‌లో తెలిపారు. మొత్తం 8 దేశాల్లో హిందుకుష్ పర్వతాలు ఉన్నాయి. సుమారు 3500 కిలోమీటర్లు వ్యాపించి ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, ఇండియా, మయన్మార్, నేపాల్, పాక్‌లో ఉన్నాయి. గంగా, బ్రహ్మాపుత్ర, ఇండస్‌తో పాటు మరికొన్ని ముఖ్యనదులు హిందూకుష్ నుంచే ఉద్భవిస్తాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న కారణంగానే హిమాలయాలు వేడెక్కుతున్నట్లు సర్వే వెల్లడించింది. మంచు కొండలు కరగడం వల్ల సుమారు 2050 వరకు గంగా, బ్రహ్మపుత నదులు విపరీతంగా ప్రవహించే అవకాశాలున్నాయన్నారు. వాయుకాలుష్యం వల్ల కూడా ఈ సమస్య ఎక్కువకానున్నది.