యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తనపై వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ డీజీపీ ఠాకూర్ కౌంటరిచ్చారు. పోలీసులకు కులం ఉండదని, తమది ఖాకీకులమని అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు నిర్దేశం ప్రకారమే ప్రమోషన్ల విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమోషన్లపై జ్యుడీషియల్ స్క్రూటినీ ఉంటుందని అన్నారు. డీజీగా ఉన్నప్పటి నుంచి తానేంటో అందరికీ తెలుసునని, నిజాయితీగా పనిచేస్తున్నానని చెప్పారు. ఈసీ నుంచి రాత పూర్వకంగా వస్తే సమాధానం ఇస్తామని డీజీపీ స్పష్టం చేశారు. ప్రమోషన్లు మెరిట్ ప్రకారమే ఇచ్చామని చెప్పారు. సీనియారిటీ లిస్టు.. హైకోర్టు ఆదేశాల మేరకే తయారు చేశామని, ఆ మేరకే ప్రమోషన్లు ఇచ్చామని డీజీపీ తెలిపారు. సామాజికవర్గానికి చెందిన.. 35మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చారని నిన్న జగన్ ఆరోపించిన విషయం తెలిసందే. డీజీపీ ఠాకూర్ పోలీసు యంత్రాంగాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే... డీజీపీ, ఇంటెలిజిన్స్ ఏడీజీని బాధ్యతల నుంచి తప్పించాలని జగన్ డిమాండ్ చేసిన విషయం విధితమే. కాగా ఇవాళ తిరుపతిలో ఆరు రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, చత్తీస్గఢ్ పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల భద్రత విషయంపై రాష్ట్రాల మద్య తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపినట్లుగా చెప్పారు. మావోయిస్టుల కదలికలు, పోలీస్ సిబ్బంది తరలింపుపై చర్చలు జరిపినట్లు తెలిపారు.