YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోదీకి దీటుగా దీదీ!...ప్రతిపక్షాల్లో కీలక నేతగా ఎదిగే యత్నం ఆచితూచి స్పందిస్తున్న ప్రతిపక్షాలు

మోదీకి దీటుగా దీదీ!...ప్రతిపక్షాల్లో కీలక నేతగా ఎదిగే యత్నం ఆచితూచి స్పందిస్తున్న ప్రతిపక్షాలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

సీబీఐ పంజరంలో చిలుక’ అని సుప్రీం కోర్ట్ చేసిన  వాఖ్యలను పావుగా చేసుకుని కేంద్రప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను వేధిస్తోందనే విషయాన్ని దేశవ్యాప్తంగా మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా మమత అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో పాలక పక్షమైన తెదేపా అటువంటి వాదననే వినిపిస్తోంది. వాస్తవానికి పలు ప్రతిపక్ష పార్టీల నేతలపై సీబీఐ దర్యాప్తులు ఇటీవల వేగవంతమయ్యాయి.మరోపక్క మమత ఇటీవల ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తూ కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇదే క్రమంలో భాజపా నేత అమిత్‌ షా పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో హెలికాప్టర్‌ క్లియరెన్స్‌కు సంబంధించిన సంఘటనలూ చోటు చేసుకున్నాయి. దీనిని అధికార దుర్వినియోగంగా భాజపా చెబుతుండగా.. భాజపాను ఢీకొనే నేతగా మమతకు ఇమేజ్‌ పెరిగిందని తృణమూల్‌ భావిస్తోంది.ఈ నేపథ్యంలో ఆదివారం కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌కు మద్దతుగా మమత దీక్షకు దిగారు. పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్‌ పాలనను అవినీతి మయంగా చూపి రాష్ట్రంలో పాగా వేయాలని భాజపా ప్రయత్నిస్తోందని దీదీ భావిస్తున్నారు. అందుకే అదే సీబీఐని కేంద్రం పావుగా వాడుకొంటోంది అంటూ నిరసన దీక్షకు దిగారనీ, దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలకు నాయకత్వం వహించేలా వ్యూహరచన చేస్తున్నారనీ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.మమత దీక్షకు మద్దతుగా దేశవ్యాప్తంగా పలు ప్రతిపక్ష పార్టీల నేతలు ట్వీట్లు చేశారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా, డీఎంకే నేత స్టాలిన్‌, ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్‌ ఆచితూచి స్పందించారు. వీరంతా సీబీఐని వినియోగించిన సమయాన్నీ, తీరునీ తప్పుపట్టారు గానీ.. శారదా కుంభకోణాన్ని సమర్థించలేదు. చివరికి మమత బెనర్జీ కూడా సీబీఐ తీరును మాత్రమే తప్పుపట్టారు. కుంభకోణాన్ని ఏమాత్రం సమర్థించలేదు. ఆధారాల కోసం సీబీఐ ఏళ్ల కొద్దీ ఉత్తరాలు రాస్తూ కాలక్షేపం చేసి ఎన్నికలకు కొన్ని నెలల ముందే దర్యాప్తును వేగవంతం చేయడం ఏమిటన్నది వీరి వాదన. ఇటీవల ఎస్పీ, బీఎస్పీ నేతలపై దర్యాప్తులను అకస్మాత్తుగా సీబీఐ వేగవంతం చేయడాన్నీ వీరు ఉదాహరణగా చెబుతున్నారు.ప్రత్యర్థులు తనపైకి విసిరే అస్త్రాలను వారిపైకే తిప్పికొట్టడంలో ప్రధాని మోదీ దిట్ట. ఈ రకమైన ప్రధాని వ్యూహాల దెబ్బకు ప్రతిపక్షాల్లో కీలక నేతల పదవులకు కూడా ఎసరు వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో ‘చాయ్‌పే చర్చ’, గుజరాత్‌ ఎన్నికల్లో మరో కాంగ్రెస్‌ నాయకుడి వ్యాఖ్యలను వాడుకొని పరిస్థితిని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకొన్న తీరు చూస్తే ఇది అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీ హవాను అడ్డుకొనే నేతల కోసం ప్రతిపక్షాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. చాలా సర్వేలు మోదీ హవా తగ్గినా.. ఆయనే నంబర్‌ వన్‌ అంటూ పేర్కొనడం ప్రతిపక్షాలను మరింత అప్రమత్తం చేసింది. మరోపక్క రాహుల్‌ కూడా రఫేల్‌ వ్యవహారాన్ని బాగానే ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారనే అభిప్రాయం నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పడే పక్షంలో మిత్ర పక్షాలకు నేతను ఎంచుకొనే అవకాశం ఇచ్చేవిధంగా ప్రియాంక గాంధీని కూడా కాంగ్రెస్‌ రంగంలోకి దింపింది. దీంతో కాంగ్రెస్‌ ప్రచారానికి భారీ ఆకర్షణ వచ్చినట్లైంది. ఈ క్రమంలో ఉద్యమ నేపథ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన మమతా బెనర్జీ దూకుడుగా రేసులోకి వచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం సందర్భంగా మొదలైన ప్రతిపక్షాల ఐక్యతను కొనసాగించడానికి మమత ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రధాని రేసులో తానూ ఉన్నట్లు చెప్పీ చెప్పకనే సందేశాలను పంపిస్తున్నారు.బీఎస్పీ అధినేత్రి మాయావతి మాత్రం ప్రధాని రేసులో ఇంకా ముందు వరుసలోకి రాలేదనే చెప్పాలి. కేవలం అఖిలేష్‌ యాదవ్‌ మాత్రమే అమెను పరోక్షంగా ప్రధాని అభ్యర్థి అని పేర్కొన్నారు. కాకపోతే ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కూటమి గణనీయంగా సీట్లను సాధిస్తే ఎన్నికల అనంతరం రాజకీయ సమీకరణాల్లో మాయావతి అనూహ్యంగా ముందుకొచ్చే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పెట్టుకొన్న పొత్తు బలమైన పునాది వేసిందనే చెప్పాలి.

Related Posts