YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

డబ్బుల్లేవ్..

 డబ్బుల్లేవ్..

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధులు కరిగిపోయాయి. కొత్త, పాతాసుపత్రుల్లో అవసరమైన కంప్యూటర్లు, ఏసీలు సహా అవసరమైన పరికరాల కొనుగోలు, మరమ్మతుల కోసం ప్రస్తుతం నిధులు లేక.. శూన్యంలోనికి చూసే పరిస్థితి ఏర్పడింది. కొత్తాసుపత్రిలో బుధవారం జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. నిధులు లేకుండా.. ఇంక అభివృద్ధికి సంబంధించి ఏం చేయాలో.. ఎలా చేయాలో తెలియక.. సమావేశాన్ని తూతూమంత్రంగా ముగించారు. అసలు నిధులు లేనప్పుడు ఈ సమావేశాలెందుకనేది ప్రశ్నార్థకం. ఎలాంటి నిర్ణయమూ తీసుకునే పరిస్థితి లేకుండాపోయింది. జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్‌ బాబూరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రతిసారీ రెండు మూడు గంటలకు పైగా సమావేశం కలెక్టర్‌ నేతృత్వంలో సుదీర్ఘంగా నిర్వహించి, పలు నిర్ణయాలు తీసుకునేవాళ్లు. ఈసారి.. కేవలం 45 నిమిషాల్లోనే ముగించి.. వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆదాయ మార్గాలపై అత్యవసరంగా దృష్టిసారించాల్సిన అవసరం ఏర్పడింది. లేదంటే.. విద్యుత్తు లాంటి మరమ్మతులకూ నిధుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.
 
విజయవాడ కొత్త, పాతాసుపత్రుల్లో ఉన్న క్యాంటిన్లు, మోడల్‌ డెయిరీపై వచ్చే అద్దెలు, ఆరోగ్యశ్రీ ద్వారా సమకూరే ఆదాయం అభివృద్ధి కమిటీ ఖాతాలో ఉండేది. ఎప్పుడూ ఎంతోకొంత నిధులు ఉంచుకుంటూ.. వాటి పరిధిలో పనులు చేపట్టుకుంటూ వచ్చారు. కానీ.. గత కొన్నేళ్లలో ఉన్న నిధులన్నింటినీ వెచ్చించేశారు. ప్రధానంగా పాతాసుపత్రిలో షెడ్డు నిర్మాణం కోసం రూ.20 లక్షల వరకూ ఖర్చు పెట్టారు. దాంతో ఉన్న నిధులన్నీ కరిగిపోయాయి. ఆ షెడ్డు కేవలం 20మందికి మాత్రమే సరిపోతోంది. అంటే.. ఒక్కో రోగికి అచ్చంగా రూ.లక్ష పెట్టినట్టే. పూర్తిగా ఉన్న డబ్బులన్నీ ఊడ్చే కార్యక్రమం చేపట్టే బదులుగా.. ఆ 20మందిని ఆసుపత్రిలోని ఏదో ఒక గదిలో సర్దుబాటు చేస్తే సరిపోయేది. కానీ.. అధికారుల ఆదేశాలతో హడావుడిగా షెడ్డు వేసేశారు. ఇప్పుడు చూస్తే.. చిన్న పనికీ డబ్బులు లేకుండాపోయింది. బుధవారం జరిగిన సమావేశంలో కేవలం రూ.10 వేల విలువైన రెండు పరికరాలకు మాత్రమే ఆమోద ముద్ర వేసేంత దయనీయ పరిస్థితి ఏర్పడింది.  ఆసుపత్రిలో పెద్ద భవనాల నిర్మాణం, అభివృద్ధి పనులు, పరికరాల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్య మౌలికవసతుల అభివృద్ధి మండలి(ఏపీఎస్‌ఎంఐడీసీ) ఆధ్వర్యంలో చేపడుతుంటారు. చిన్న పనులు, పరికరాల కొనుగోలు వంటివన్నీ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధులతోనే చేసుకోవాలి. రాజధానిలోని అత్యంత కీలకమైన విజయవాడ కొత్త, పాతాసుపత్రులకు అత్యవసరంగా ఏవైనా పనులు చేపట్టాలంటే ఇప్పుడు నిధులు లేకుండాపోయాయి. ప్రస్తుతం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల నిధుల నుంచైనా ఎంతోకొంత సమీకరించగలిగితే.. అత్యవసరంగా నిధులు సమకూరుతాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు దీనిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

Related Posts