యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
2014 సునాయాసంగా అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడం కష్టంగా మారింది. అప్పుడు మోదీకి ఉన్న క్రేజ్‌కు తోడు కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత ఎన్డీయేను అధికారంలోకి తీసుకువచ్చాయి. కానీ, ఈ సారి ఆ పరిస్థితులు కనిపించడం లేదు. దీనికి కారణం ప్రస్తుతం ప్రభుత్వంపై రోజురోజుకూ పెరుగుతున్న వ్యతిరేకతే. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పలు సంస్కరణలు, తీసుకున్న నిర్ణయాలు దీనికి కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి కొన్ని సంస్కరణలకు ప్రజల నుంచి ప్రతికూల స్పందన వచ్చింది. వీటికి తోడు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కూడా భారీ స్థాయిలో ఉండడంతో కేంద్రంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీంతో కొందరు వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకు కష్టాలు తప్పవనే అభిప్రాయానికి వచ్చేశారు. దీనికి తోడు, బీజేపీయేతర పార్టీలు బలపడుతుండడం.. అవన్నీ కలిసి కూటమిని ఏర్పాటు చేస్తుండడం కూడా ఎన్డీయేను భయపెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీయేతర కూటమికై పావులు కదుపుతున్న ఏపీ సీఎం చంద్రబాబు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అదిరిపోయే అస్త్రాన్ని సిద్దం చేసినట్లు తెలుస్తోంది.తెలుగుదేశం పార్టీ.. ఎన్డీయే నుంచి బయటికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. దీంతో చంద్రబాబు.. రాహుల్ తరచూ చర్చలు జరుపుతున్నారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్న దానిపై కాకుండా.. బీజేపీని ఎలా ఓడించాలన్న దానిపై దృష్టి సారిస్తే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చన్న అభిప్రాయానికి వచ్చేశారు. అందుకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో కమలం పార్టీని దెబ్బ కొట్టేందుకు వీళ్లిద్దరూ కలిసి ఓ ప్లాన్ రెడీ చేశారట. అదే ‘ఆపరేషన్ గడ్కరీ’ అని తెలుస్తోంది. మోదీ, అమిత్‌షా నాయకత్వంపై తరచూ పరోక్ష విమర్శలు చేస్తుంటారు కేంద్ర మంత్రి గడ్కరీ. ఈయన చంద్రబాబు పట్ల సానుకూల వైఖరితో ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు దీనినే వాడుకుని మోదీ అండ్ కోను ఇరుకున పెట్టాలని చూస్తున్నారట చంద్రబాబు, రాహుల్. ఇందులో భాగంగానే గడ్కరీని హైలైట్ చేయడం.. అదే సమయంలో మోదీ, అమిత్ షాను తగ్గించడం చేయాలని ప్లాన్ చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. బీజేపీలోని సీనియర్లు సైతం ఈ సారి ప్రధాని అభ్యర్థిగా గడ్కరీని ప్రకటించాలని అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వీళ్ల ప్లాన్ వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు