YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ జనాల్లోకి జగన్

మళ్లీ జనాల్లోకి  జగన్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

వేడెక్కిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రాజకీయాలు రేపటి నుంచి మరింత రాజుకోనున్నాయి. ఇప్పటికే కొత్త పథకాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ప్రతీరోజు ఏదో ఒక జిల్లాలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతీ రోజు ‘మిషన్ ఎలక్షన్-2019’ పేరుతో పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్సులు నిర్వహిస్తూ ఎన్నికలపై చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక, 14 నెలల పాటు సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేసుకొని 25 రోజులుగా పార్టీ వ్యవహారాలు, చేరికలు, వ్యూహాలకు పరిమితమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజాక్షేత్రంలోకి వెళ్లబోతున్నారు.  పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కానున్నారు. తిరుపతిలో సమర శంఖారావం పేరుతో సభ నిర్వహించనున్నారు. వైసీపీ గెలుస్తుందనే అంచనాలు సర్వత్రా వ్యక్తమైనా చివరి నిమిషంలో రాజకీయ పరిణామాలు, పోల్ మేనేజ్ మెంట్ లో టీడీపీ అనుభవం వైసీపీని దెబ్బతీశాయి. బలం ఉన్నా పోల్ మేనేజ్ మెంట్ లో విఫలం కావడం వైసీపీకి ఓటమికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలనే కసితో ఉన్న జగన్.. గత ఎన్నికల్లో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఓటర్ల జాబితాలో అవకతవకలు, బోగస్ సర్వేలు, ఎన్నికల సమయంలో పనిచేసే అధికారులపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎక్కడ తమకు నష్టం జరిగే అవకాశం ఉన్నా దానిని గట్టిగా ఎదుర్కోవాలని భావిస్తున్నారు. ఇక, ప్రధానంగా బూత్ లెవల్ మేనేజ్ మెంట్ లో వైసీపీ వెనుకబడింది. అదే సమయంలో టీడీపీ బలంగా ఉంది. దీంతో ఇటువైపు ఇప్పుడు జగన్ దృష్టి పెట్టారు. నేడు తిరుపతిలో ఆయన సమర శంఖారావం పేరుతో బూత్ లెవల్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు, పార్టీ శ్రేణులతో సమావేవం నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు రానున్నాయి. బూత్ స్థాయిలో ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి, ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని, పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే అంశాలపై ఆయన దిశానిర్దేశం చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయమే ఉన్నందున ఈ సమయం కీలకమైనదిగా జగన్ భావిస్తున్నారు. తిరుపతి తర్వాత వరుసగా అన్ని జిల్లాల్లో ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక, జిల్లాల్లో ఈ సమావేశాలతో పాటు జగన్… ఆ జిల్లాకు చెందిన తటస్థులతోనూ భేటీ కానున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 75 వేల మంది తటస్థులను గుర్తించి జగన్ వారికి లేఖలు రాశారు. వారి నుంచి రాష్ట్ర ప్రగతి, వైసీపీ అధికారంలోకి వస్తే చేయాల్సిన కార్యక్రమాలపై సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఇక, 14వ తేదీన అమరావతిలో జగన్ గృహప్రవేశంతో పాటు పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఇక నుంచి పూర్తిగా జగన్ ప్రజల్లోనే ఉండేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు.

Related Posts