యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైఎస్ జగన్ విసిరిన ఆరోపణల వలకు టిడిపి చిక్కింది. దీనినుంచి బయట పడేందుకు చేసిన ప్రయత్నంలో ఆ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదెలా జరిగింది అంటే ? కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసి టిడిపి చేస్తున్న అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లారు వైసిపి అధినేత జగన్. అక్కడ ఈసీని కలిసి మూడు ప్రధాన ఆరోపణలను అధికారపార్టీపై జగన్ ఫిర్యాదురూపంలో ఇచ్చారు. ఆ తరువాత జాతీయ మీడియా ముందు జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారాయి. అవి ఇప్పుడు ఎపి పోలీస్ శాఖలో హాట్ టాపిక్ అయ్యాయి.జగన్ తన ప్రధాన ఆరోపణల్లో ఒకటి దాదాపు 60 లక్షల నకిలీ ఓట్లు ఏపీలో ఉన్నాయని వాటిని తొలగించి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. మరొకటి ఇటీవల టిడిపి ఏపీలో 37 మంది సి ఐ లకు డిఎస్పీలుగా పదోన్నతులు కల్పించిందని వారిలో 35 మంది చంద్రబాబు సామాజిక వర్గానికి మాత్రమే అవకాశం ఇచ్చిందని ఆరోపించారు. మరో ఇద్దరిలో ఒకరు కమ్మ సామాజిక వర్గం వారిని పెళ్లిచేసుకున్నందుకు ప్రమోషన్ ఇచ్చిందని సంచలన ఆరోపణ చేశారు. ఈ ఆరోపణలు అధికార పార్టీలోనూ పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఎపి ఉపముఖ్యమంత్రి, హోమ్ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్పను అధికార పార్టీ రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు చేపట్టేందుకు ఎదురు దాడి చేయాలని ఆదేశించింది. అయితే జగన్ వ్యాఖ్యలపై హోమ్ మంత్రి నేరుగా స్పందించలేదు. వచ్చే ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వ అవసరాలను దృష్టి లో పెట్టుకుని బదిలీలు చేశామని పదోన్నతికి అర్హత ఉన్నవారికే ప్రమోషన్ ఇచ్చామంటూ ముఖ్యమంత్రి కులానికే పెద్ద పీట వేశామని పరోక్షంగా అంగీకరించి మరో చర్చకు తెరతీశారు.జగన్ ఓటమి భయంతోనే ఈ ఆరోపణలను చేస్తున్నారంటూ అసలు వ్యవహారాన్ని మరుగున పరిచే ప్రయత్నం చేశారు రాజప్ప. ఎపి పోలీసులపై నమ్మకం లేని జగన్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు ఎందుకు చేస్తున్నారన్న వాదన తెచ్చారు. వివాద రహితుడు సౌమ్యుడు గా పేరొందిన హోమ్ మంత్రి చినరాజప్ప చేత జగన్ కి కౌంటర్ ఇప్పించబోయి మొత్తానికి టిడిపి సెల్ఫ్ గోల్ కొట్టుకుందన్న విమర్శలు సోషల్ మీడియా వేదికలపైనా చర్చ గా మారడం గమనార్హం. జగన్ చేసిన మరో ఆరోపణ కూడా విడ్డురంగా ఉందని ముగ్గురు అధికారులను వచ్చే ఎన్నికల విధులనుంచి తప్పించాలని కోరడం ఆయన అభద్రతకు సూచిక అన్నారు ఉప ముఖ్యమంత్రి. ఈవీఎం లపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేయడం వల్లే తాము వాటిని రద్దు చేసి బ్యాలెట్ పెట్టాలని కోరుతున్నట్లు రాజప్ప చెప్పుకొచ్చారు. గతంలో వైఎస్ తనకు అనుకూలంగా వ్యవహరించే అధికారులను నియమించుకోలేదా అని ఎదురు ప్రశ్నించి ఈ వివాదం రాజప్ప మరింత రాజేయడం విశేషం