యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
మార్చిలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న తరుణంలో ఇప్పటికీ ఇంకా పరీక్షా కేంద్రాలను ఖరారు చేసే ప్రక్రియ కొలిక్కిరాలేదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలు లేకపోవడంతో ప్రైవేట్ పాఠశాలలనూ పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసి పాఠశాల విద్యాశాఖకు జిల్లా విద్యా శాఖాధికారులు పంపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, కొన్ని పట్టణాల్లో పరీక్షా కేంద్రాల కొరత ఉన్న కారణంగా ప్రైవేట్ పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను అనుమతించాలని కోరుతూ దొడ్డిదారి ప్రయత్నాలకు తెరతీశారు.ప్రభుత్వ పాఠశాలల్లోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. కార్పొరేట్ సంస్థల హవాకు అడ్డుకట్ట వేసేందుకు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచే పేరుతో ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. అయితే విద్యార్థుల సంఖ్యకు తగినన్న ప్రభుత్వ పాఠశాలలు లేకపోయినా ఈ నిర్ణయం తీసుకోవడం విమర్శలకు గురి అవుతోంది. పరీక్షా కేంద్రాల కొరత ఉందంటూ మళ్లీ మినహాయింపు ఇచ్చేందుకు కొన్ని జిల్లా విద్యాశాఖాధికారులు దొడ్డిదారి వ్యవహారాలకు తెరతీస్తున్నట్లు తెలుస్తోంది. పాఠశాల విద్యలో అనేక రకాల ప్రయోగాలు చేస్తూ, చివరి నిమిషం వరకూ స్పష్టత ఇవ్వకుండా విద్యార్థులను, తల్లితండ్రులను ఇబ్బందుల పాలు చేయడంలో పాఠశాల విద్యా శాఖ ఘన కీర్తి గడించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకూ కంటిన్యువస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ (సీసీఈ) విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ విధానంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలో 20 మార్కులకు సమ్మెటివ్ అసెస్‌మెంట్లు, తదితర పరీక్షల ద్వారా మదింపు చేస్తారు. 80 మార్కులకే మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. ఈ విధానంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 20కి 20 మార్కులు సాధిస్తుండటంతో ప్రభుత్వం ఈ విషయమై పునరాలోచనలో పడింది. ఈ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు తొలుత ప్రకటించి, విచారణకు ఒక కమిటీని నియమించింది. కమిటీ నివేదికలో అక్రమాలు జరుగుతున్నట్లు వెల్లడికావడంతో ఈ విధానాన్ని రద్దు చేయకుండా, కొన్ని మార్పులతో సీసీఈని కొనసాగించేందుకు నిర్ణయించింది. దీంతో గత రెండేళ్లుగా ఈ విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విధానాన్ని అమలు చేయకముందు రాష్ట్రంలో 10/10 జీపీఏ సాధించిన విద్యార్థుల సంఖ్య కేవలం 6441 కాగా ఈ విధానంలో అమల్లోకి వచ్చాక వీరి సంఖ్య భారీగా పెరగడం గమనార్హం. 2017లో 18,225 మంది, 2018లో 29,921 మంది 10/10 జీపీఏ సాధించడం గమనార్హం. ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులే ఎక్కువ సంఖ్యలో మెరుగైన జీపీఏ సాధిస్తుండటంతో పదో పరీక్షను కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసి వివరాలు పంపాలను జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించింది. ఆ వివరాల్లో ప్రభుత్వేతర పాఠశాలలను కూడా కేంద్రాలుగా ఎంపిక చేస్తే, ఆ వివరాలను కూడా పంపాలని ఆదేశించింది. దాదాపు 6 లక్షల మంది ప్రతి ఏటా పదో పరీక్షకు హాజరవుతారు. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 2835 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సారి దాదాపు అదే సంఖ్యలో పరీక్షా కేంద్రాలు ఉండే అవకాశం ఉంది. అయితే సాధారణంగా సగం కేంద్రాలు ప్రైవేట్ పాఠశాలల్లోనే ఉంటాయి. ఈ సారి కేవలం ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే పరీక్షా కేంద్రాలను పరిమితం చేయడం ద్వారా పరీక్షా కేంద్రాల కొరత ఏర్పడనుంది. దీంతో మరోసారి పదోతరగతి విద్యార్థులను ఆయోమయంలో పడవేయనున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉంటున్న నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా అనుమతించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షా కేంద్రంలో ఫ్యాన్లు, గాలి వెలుతురు ఉండే గదుల ఎంపిక, ఫర్నిచర్ వంటివి కూడా దృష్టిలో ఉంచుకోవాలని కొంతమంది సూచిస్తున్నారు. ఉత్తీర్ణతకు సంబంధించి టార్గెట్లు నిర్ణయిస్తున్న నేపథ్యంలో ఈ తాజా నిర్ణయం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.