YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మూడో రోజు కోట్ల అభిమానులతో చర్చోపచర్చలు

మూడో రోజు కోట్ల అభిమానులతో చర్చోపచర్చలు
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డికి అభిమానుల నుంచి మద్దతు పెరుగుతోంది. మూడు రోజులుగా కర్నూలులో ఉన్న ఆయన మండలాల వారీగా తన అభిమానులతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌కు దూరం కావడానికి కారణాలు మరో పార్టీలో చేరాలనుకుంటున్న అభిప్రాయాన్ని వారితో పంచుకుంటున్నారు. ఆయనతో మూడు, నాలుగు నియోజకవర్గాల్లోని అభిమానులు, సన్నిహితులు, నాయకులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారు కోట్ల తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరి కొందరు వైసీపీలో చేరితే భాగుంటుందని సూచించినట్లు కూడా తెలుస్తోంది. ఈ అంశంపై వారికి వివరణ ఇచ్చి తనకు తోడుగా ఉండాలని కోరినట్లు చర్చించుకుంటున్నారు. గతంలో కోట్ల వెంట నడిచి 2014 ఎన్నికల తరువాత ఇతర పార్టీల్లో చేరిన వారు సైతం ఆయనతో చర్చించేందుకు రావడంతో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఆనందంతో ఉన్నట్లు సన్నిహితులు పేర్కొన్నారు. రాజకీయ కారణాలతో ఇతర పార్టీల్లోకి వెళ్లినా తనపై ఇంకా వారికి నమ్మకం ఉండడం సంతోషించాల్సిన అంశమని పేర్కొన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ కోసం తాను పడ్డ శ్రమ కేవలం రాష్ట్ర నాయకుల కారణంగా బూడిదలో పోసిన పన్నీరుగా మారిందని, ఇప్పటికీ ఢిల్లీ పెద్దలు వారి మాటే వినడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని సన్నిహితుల వద్ద కోట్ల వాపోయినట్లు సమాచారం. ఇక కాంగ్రెస్‌లో కొనసాగలేమని తేల్చిచెప్పి తనకు అండగా ఉండాలని అభిమానులను కోరుతున్నట్లు తెలుస్తోంది. తన స్థాయికి తగిన గౌరవం వైకాపాలో కూడా దక్కకపోవచ్చని అన్ని విధాలా అండగా ఉంటానని టీడీపీ అధినేత చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని, అందులో భాగంగా తాను కోరిన వెంటనే వేదావతి ఎత్తిపోతల పథకానికి రూ.1900కోట్లను మంజూరు చేస్తూ జీఓ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారని సన్నిహితులు పేర్కొంటున్నారు. త్వరలోనే తుంగభద్ర దిగువ కాలువకు జలాశయం నుంచి భూగర్భ పైపు లైను పనులు మంజూరు చేస్తారన్న విశ్వాసాన్ని కోట్ల తన అభిమానులతో అన్నట్లు సమాచారం. ఇదే జరిగితే కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంలో కరువు ఛాయలు దూరమవుతాయని వెల్లడించినట్లు తెలిసింది. వేదవతి, దిగువ కాలువ భూగర్భ పైపులైను పనులు, గుండ్రేవుల జలాశయం నిర్మాణం పూర్తయ్యే వరకు తాను విశ్రమించబోనని హామీ ఇచ్చారని సమాచారం. ఈ మూడు ప్రాజెక్టులను రానున్న అయిదేళ్ల కాలంలో పూర్తి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని గట్టిగా చెబుతున్నారని వెల్లడవుతోంది. కోట్లతో చర్చలు జరిపిన వారు అత్యధికులు కాంగ్రెస్‌కు దూరం కావడం మంచి నిర్ణయమేనని పేర్కొన్నట్లు తెలిసింది. కొత్త ప్రాజెక్టుల విషయంలో పట్టుదలతో పని చేయాలని కోరినట్లు సమాచారం. గత రెండు రోజులుగా కర్నూలులోని కోట్ల స్వగృహం నాయకులు, సన్నిహితులు, అభిమానులతో కిటకిటలాడుతోంది. కోట్ల కుటుంబం పార్టీ మారుతుందన్న వార్తల నేపథ్యంలో జిల్లాలో రాజకీయ చర్చలు జోరుగా సాగుతున్నాయి

Related Posts