యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి ప్రయోగించింది. ఫ్రెంచ్ గయానాలోని కౌరు నుంచి అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం తెల్లవారుజామున 2.31 గంటలకు ప్రయోగించిన , జీశాట్ 31 ప్రయోగం జరుగగా, ఏరియన్ స్పేస్ సంస్థకు చెందిన ఏరియన్ 5 రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ అంతరిక్షానికి చేరింది. కమ్యూనికేషన్ సేవలను అందించే ఈ శాటిలైట్ 15 సంవత్సరాల పాటు పనిచేయనుంది. జీశాట్ 31తో పాటే సౌదీకి చెందిన 1 హెల్లాస్ శాట్ 4 ఉపగ్రహాన్ని కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. జీశాట్ 31 బరువు 2,535 కిలోలకాగా, అత్యంత సమర్థమంతమైన కేయూ బ్యాండ్ ప్రసార వ్యవస్థను ఇది కలిగివుంటుంది. భారత భూమి, ద్వీపాలు, అరేబియా సముద్రం, బంగాళాఖాతం పరిసరాల సమాచారాన్ని ఇది అందించనుంది. ఇదే సమయంలో వీశాట్ నెట్ వర్క్స్, టెలివిజన్ అప్ లింక్స్, డిజిటల్ శాటిలైట్, డీటీహెచ్, సెల్యులార్ బ్యాకప్ తదితరాలకు అనుకూలమైన సాంకేతికత ఇందులో ఉందని ఇస్రో తెలిపింది.