యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత మహిళల జట్టు ఓటమిపాలైంది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను ప్రత్యర్థికి అప్పగించేశారు. స్మృతి మంధాన(58: 34 బంతుల్లో 7ఫోర్లు,3సిక్సర్లు), రోడ్రిగ్స్(39: 33 బంతుల్లో 6ఫోర్లు) మినహా అందరూ నిరాశపరిచారు. ఆరంభంలో వీరిద్దరి జోరుకు లక్ష్యాన్ని అలవోకగా ఛేదిస్తారని అనుకున్నారంతా. కానీ, మంధాన ఔటైన తర్వాత స్వల్ప వ్యవధిలోనే రోడ్రిగ్స్ వెనుదిరగడంతో భారత్ టపటపా వికెట్లు చేజార్చుకుంది. తర్వాత బ్యాటింగ్ చేసిన ఐదుగురు బ్యాట్స్‌వుమెన్ ఒక్కరు కూడా రెండంకెల స్కోరు సాధించలేకపోయారు. 160 పరుగుల లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ కివీస్ బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసింది. డెవిన్(62), సాటర్తవైట్(33) రాణించారు