
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
హైదరాబాద్ బర్కత్‌పురాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదనే కోపంతో ఇంటర్ విద్యార్థిని మధులికపై కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేశాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించారు. ఆమె మెడ వెనుక భాగం, పొట్ట, వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. నిందితుడు భరత్ పరారీలో ఉన్నాడు. సత్యనగర్‌కు చెందిన భరత్, మధులికలు పక్క, పక్క ఇళ్లలోనే ఉంటున్నారు. భరత్ కొంతకాలంగా ప్రేమ పేరుతో మధులిక వెంటపడుతున్నాడు. ఆమె ప్రేమను తిరస్కరించింది. కొద్దిరోజుల క్రితం షీ టీమ్‌కు కూడా పట్టించింది. దీంతో భరత్‌కు తల్లిదండ్రుల సమక్షంలో భరోసా సెంటర్‌లో కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు. కాని అతడిలో ఎలాంటి మార్పు రాకపోగా.. మళ్లీ ఆమె వెంటపడుతున్నాడు. భరత్ వెంటపడుతున్నాడని మధులిక రెండు రోజుల క్రితం తన తల్లికి చెప్పింది. ప్రేమను నిరాకరించడం, ఆమె ఇంట్లో తల్లికి చెప్పడంతో కక్ష పెంచుకున్న భరత్.. ఇవాళ ఆమెపై దాడి చేయాలని ప్లాన్ చేశాడు. ఆమె కాలేజీకి వెళుతున్న సమయంలో వెంటపడి.. కొబ్బరి బోండాల కత్తితో దారుణంగా దాడి చేశాడు.