యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
టీడీపీ నేతలు హద్దులు మీరుతున్నారని హెచ్చరించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఏపీ ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎత్తి చూపితే.. ఎదురు దాడికి దిగడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ నేతలు చేసే తప్పుడు పనుల్ని ఎలా అడ్డుకోవాలో బాగా తెలుసంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ను కలిశాక జీవీఎల్ మాట్లాడారు. టీడీపీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు. తనపై పిచ్చి, పిచ్చి వ్యాఖ్యలు చేసిన వారిపై రాజనాథ్ సింగ్‌కు ఫిర్యాదు చేసినట్లు జీవీఎల్ తెలిపారు. టీడీపీ నేతలు బీజేపీ నేతలు, కార్యకర్తలను బెదిరిస్తున్నారని.. ఈ వ్యవహారాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు. చంద్రబాబు అండ చూసుకొని “కాల్ మనీ సెక్స్ రాకెట్”లో సూత్రధారిగా ఉన్న ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్‌ను కోరానన్నారు. తనకు బహిరంగంగా క్షమాపణ చెబితే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తానన్నారు జీవీఎల్. చంద్రబాబుపైనా మండిపడ్డారు బీజేపీ ఎంపీ. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న బాబే.. బీజేపీతో పొత్తుకు అర్చులు చాచారని వ్యాఖ్యానించారు. పొత్తుల విషయంలో చంద్రబాబు “యూ టర్న్ ముఖ్యమంత్రిగా” చరిత్రలో నిలిచారంటూ ఎద్దేవా చేశారు. ఆయన ఇప్పుడు పొత్తుల గురించి మాట్లాడం విడ్డూరంగా ఉందంటూ చురకలు అంటించారు.