దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పడిపోయి వణికిస్తున్న చలితో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే వెయ్యిమందికి స్వైన్ ఫ్లూ వ్యాధి సోకడంతో వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం స్వైన్ ఫ్లూ తోఒకరు మరణించడంతో ఢిల్లీ ప్రజల్లో కలవరపడుతున్నారు. పెద్దలే కాకుండా 183 మంది పిల్లలు స్వైన్ ఫ్లూ బారిన పడ్డారని వైద్యఆరోగ్యశాఖ డైరెక్టరు జనరల్ తన నివేదికలో వెల్లడించారు. ఇప్పటివరకు 13 మంది స్వైన్ ఫ్లూతో మరణించారని వైద్యులు ప్రకటించారు. మధుమేహం, గుండె జబ్బులు, మూత్రపిండాలు మార్పిడి చేసుకున్న వారు, బ్లడ్ కేన్సర్ వ్యాధిగ్రస్థులకు వ్యాధినిరోధకశక్తి తగ్గి స్వైన్ ఫ్లూ సోకే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు. స్వైన్ ఫ్లూ గురించి రోగులకు సహాయమందించేందుకు 24 గంటలూ పనిచేసేలా 011-22300012, 22307145 ఫోన్ నంబర్లతో హెల్ప్ లైన్ ను వైద్యశాఖ ప్రారంభించింది.