యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
గత ఏడాది భారీ వరదలతో కేరళ అతలాకుతలమైన సంగతి గుర్తుంది కదూ. కనీవిని ఎరగని స్థాయిలో వర్షాలు, వరదల కారణంగా కేరళ ప్రజానీకం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద ముంపులో చిక్కుకున్న వారిని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కాపాడింది. వరద బాధితులను సురక్షితంగా తరలించేందుకు కేరళ మత్స్యకారులు కూడా అలుపెరగకుండా శ్రమించారు. మత్స్యకారులు మా సైన్యం అని అప్పట్లో కేరళ ప్రభుత్వం సగర్వంగా ప్రకటించింది. కేరళ వరదల్లో చిక్కుకున్న 65 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన మత్స్యకారులను నోబెల్ శాంతి పురస్కారానికి తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ నామినేట్ చేశారు. ‘అత్యంత విషాదకరమైన సమయంలో మత్స్యకారులు బృందాలుగా ఏర్పడి వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడారు. పడవల్లో ప్రతి ఇంటికి వెళ్లి వరదలో చిక్కుకుపోయి దీనస్థితిలో ఉన్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. వరద ప్రవాహంలోకి దూకి మరీ సాటి మనుషులను కాపాడారు. స్థానిక పరిస్థితుల పట్ల పూర్తి అవగాహన ఉన్న మత్స్యకారులు.. వరదల సమయంలో చేసిన కృషిని మరువలేం’ అని శశిథరూర్ నోబెల్ కమిటీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో తమకెందుకులే అని ఇంట్లో కూర్చోకుండా తోటి మనుషులను ప్రాణాలను కాపాడేందుకు మత్స్యకారులు వాహనాల్లో వరద ప్రభావిత ప్రాంతాలకు తమ పడవలను తరలించారు. మహిళలు, వృద్ధులు పడవ ఎక్కడంలో ఇబ్బందులు పడుతుంటే ఓ మత్స్యకారుడు నీళ్లలోనే కిందకు వంగి తన వీపునే బల్లగా మార్చిన వీడియో సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యిందో తెలిసిందే. వరదల్లో చిక్కుకుపోయిన 65 వేల మందిని కేరళ మత్స్యకారులు కాపాడారని మత్స్యశాఖ మంత్రి మెర్సీకుట్టీ గతంలో ప్రకటించారు. పథానంథిట్ట జిల్లాలోనే వరద బాధితుల్లో 70 శాతం మందిని మత్స్యకారులే కాపాడారు.