యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
ఒకప్పుడు టాలీవుడ్ హీరోలు తెలుగు రాష్ట్రాలకే పరిమితమయ్యేవారు. ప్రస్తుతం టెక్నాలజీ పుణ్యమా అని అన్ని భాషల ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. ముఖ్యంగా సోషల్ వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్‌కు ప్రజల్లో ఆదరణ దృష్ట్యా తెలుగు సినిమాలోను హిందీలోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను హిందీ ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇప్పటికే చాలా తెలుగు సినిమాలు హిందీ ప్రేక్షకులను మెప్పించాయి. తాజాగా రామ్ సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ’ కూడా ఆ కోవలోకి చేరింది. రామ్ హీరోగా నటించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ హిందీలో మాత్రం మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమా హిందీ హక్కులను కొనుగోలు చేసిన గోల్డ్‌మైన్స్ టెలీఫిలిమ్స్ సంస్థ హిందీలోకి అనువాదం చేసి ‘నెం.1 దిల్ వాలా’ పేరుతో యూట్యూబ్‌లో విడుదల చేసింది. విడుదలైన మూడు రోజుల్లోనే 33 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. గతంలో హిందీలోకి అనువాదమై యూట్యూట్‌లో విడుదలైన ఏ తెలుగు సినిమాకు మూడు రోజుల్లో ఇన్ని వ్యూస్ రాకపోవడం గమనార్హం. గోల్డ్‌మైన్స్ టెలీఫిలిమ్స్ అధినేత మనీష్ షా ఇప్పటికే చాలా తెలుగు సినిమాలను హిందీ ప్రేక్షకులను అందించారు. వాటిలో ‘సరైనోడు’, ‘డీజే’, ‘అజ్ఞాతవాసి’, ‘ఫిదా’, ‘చిన్నదాన నీ కోసం’, ‘జవాన్’ సినిమాలు మంచి వ్యూస్‌ను రాబట్టాయి. కాగా, ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై స్రవంతి రవికిశోర్, కృష్ణ చైతన్య సంయుక్తంగా నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.