యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఆర్థికవేత్తలు, పారిశ్రామిక వర్గాల అంచనాలకు తగినట్టుగానే భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) 17 నెలల తర్వాత ఎట్టకేలకు కీలక వడ్డీరేట్ల తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అధ్యక్షతన ఇవాళ జరిగిన ద్రవ్య విధాన పరపతి సమీక్షలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఇప్పుడు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి దిగివచ్చింది. రివర్స్ రెపోరేటును సైతం 6 శాతంగానూ, బ్యాంకు రేటును 6.5శాతంగానూ నిర్ణయించారు. ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపట్టిన తొలి ద్రవ్య విధాన సమీక్ష ఇదే కావడం మరో విశేషం. ఆగస్టు 2017లో చివరిసారి వడ్డీరేట్లను తగ్గించారు. తాజాగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలతో రుణాలు మరింత చౌకగా లభించే అవకాశాలున్నట్టు ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. కాగా జీడీపీ వృద్ధి లక్ష్యాన్ని మాత్రం ఆర్బీఐ యథాతథంగా 7.4 శాతంగానే ఉంచింది. ద్రవ్యోల్బణం జనవరి-మార్చి మధ్య 2.4 శాతంగానూ, ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 3.2-3.4 శాతంగానూ ఉంటుందని అంచనా వేసింది.