యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మొన్నటి వరకు పాదయాత్రతో బిజీగా ఉన్న జగన్ తొందరలో బస్సుయాత్రను కూడా మొదలుపెట్టబోతున్నారు. ఈమధ్యలో ఖాళీగా ఎందుకుండాలని అనుకున్నారేమో ? అందుకనే తటస్ధులతో ముఖాముఖి అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకాకురం చుట్టారు. రాబోయే ఎన్నికల్లో తటస్ధుల ఓట్లు ఎంత కీలకమో జగన్ గ్రహించినట్లున్నారు. ఒకపుడు చంద్రబాబు కూడా రాజకీయాలతో సంబంధం లేని వారికి తటస్ధుల కోటాలో ఎంఎల్ఏ, ఎంపి టిక్కెట్టిచ్చి ప్రోత్సహించారు. కాకపోతే ఇఫుడు జగన్ అదే తటస్ధులకు టిక్కెట్లిస్తానని ప్రకటించలేదు కానీ వారితో ముఖాముఖి సమావేశాలైతే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే కడపలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తటస్ధుల కోటాలో మేధావులు, సామాజిక కార్యకర్తలు అండ్ కో పాల్గొన్నారు.వైసిపి అంచనా ప్రకారం రాష్ట్రంలో తటస్ధుల ఓట్లు సుమారు 10 శాతం ఉంటుందట. జాతీయ మీడియా తాజా అంచనా ప్రకారం వైసిపికి 46 శాతం ఓట్లు, టిడిపికి 36 శాతం ఓట్లు పడతాయి. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు కలిపి సుమారు 6 శాతం ఓట్లు పడతాయి.అంటే జాతీయ మీడియా అంచనా ప్రకారం కూడా అన్నీ పార్టీలకు పోని ఇంకా 12 శాతం ఓట్లు మిగిలే ఉన్నాయి. అంటే కాస్త అటు ఇటుగా చూసినా 10 శాతం ఓట్లయితే తటస్ధులదే అని అంచనా. మరి 10 శాతం ఓట్లంటే మామూలు విషయం కాదు. పోయిన ఎన్నికల్లో జగన్ కు పోలైన ఓట్ల కన్నా చంద్రబాబు అండ్ కోకు పోలైన ఓట్లు 1.6 శాతం మాత్రమే ఎక్కువ. 1.6 శాతం ఓట్ల తేడాతోనే చంద్రబాబు అధికారంలోకి వస్తే మరి తటస్ధుల 10 శాతం ఓట్లు ఎంత ప్రభావం చూపాలి ? అందుకే తటస్దులను వైసిపి వైపు ఆకర్షించటానికి జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మరి జగన్ ఎత్తుగడ ఏ మేరకు ఫలిస్తుందో చూడాల్సిందే