యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులకు చావు దెబ్బ తగిలింది. బీజాపూర్ లోని బైరాన్ ఘడ్ లో జరిగిన ఘటన లో పదిమంది మావోయిస్టులను పోలీసులు మట్టుపెట్టారు. గురువారం తెల్లవారుజామున భద్రతాదళాలు కూంబింగ్ చేపడుతుండగా మావోలు ఎదురుపడ్డారు. దాంతో ఇరు వర్గాల మధ్య భీకర ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో భద్రతాబలగాలు పది మంది మావోయిస్టులను కాల్చిచంపాయి. ఘటనాస్థలం నుంచి అధికారులు భారీ ఎత్తున మందుగుండు సామగ్రి, 11 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మావోయిస్టుల కోసం బలగాలు గాలిస్తున్నాయి. ఘటనపై జిల్లా ఎస్పీ మోహిత్ గార్గ్ మాట్లాడుతూ బైరాన్ ఘడ్ ప్రాంతంలో గురువారం ఎస్టీఎఫ్, డీఆర్జీ సంయుక్త బలగాలు కూంబింగ్ చేపట్టాయని తెలిపారు. ఇంతలోనే మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. ఈ ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాల తరఫున ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదన్నారు. ఘటనాస్థలం నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపును ముమ్మరం చేశామన్నారు.