యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్‌కతా పోలీసు కమిషనర్‌పై సీబీఐ దాడి, విదేశీ ఆస్తులకు సంబంధించి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఈడీ విచారణ సంఘటనలు కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలను మరింత దగ్గర చేశాయి. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు మొదటి నుంచి ఐక్యతా రాగాన్ని ఆలపిస్తున్నప్పటికీ ఢిల్లీ పీఠాన్ని ఎవరు అధిష్టించాలన్న అంశంలో రాజీ కుదరక ఈ ఇరు పార్టీలు కాస్త దూర దూరంగానే ఉంటూ వచ్చాయి. ఆదివారం నాడు సీబీఐకి చెందిన 40 మంది అధికారులు కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ నివాసాన్ని ముట్టడించడం, అందుకు నిరసనగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధర్నా చేపట్టడం తెల్సిందే. ఈ వార్త తెల్సిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మమతకు ఫోన్ చేసి పార్టీ మద్దతును ప్రకటించారు. రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాకు బ్రిటన్‌లో అక్రమంగా ఆస్తులున్నాయన్న ఆరోపణలపై ఈడీ అధికారులు నిన్న, నేడు ఆయన్ని విచారించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మమతకు కూడా స్పందించి రాహుల్‌కు మద్దతుగా నిలిచారు.వాద్రాకు కేవలం షోకాజ్ నోటీసు జారీ చేసి విచారణ పేరుతో హంగామా చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. ‘మనమంతా ఐక్యంగా ఉన్నంత కాలం మనల్ని ఎవరు, ఏం చేయలేరు’ అని ఆమె బుధవారం కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘బీజేపీకే పాస్ సీబీఐ హైతో హమారే పాస్ ఘట్‌బంధన్ హై’ అని ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తామని ప్రకటించిన అఖిలేష్ యాదవ్, మాయావతిలు సంయుక్తంగా నినదించారు. వారు కూడా ఇప్పుడు వాద్రా విషయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. అఖిలేష్, మాయావతిలపై కూడా సీబీఐ దాడులు జరుగుతున్న విషయం తెల్సిందే. ప్రతిపక్షాలు లక్ష్యంగా సీబీఐ దాడులు జరిగితే ఆ పార్టీలు కకావికలంగా విచ్ఛిన్నం అవుతాయని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావించి ఉండవచ్చు. కానీ ఈ సీబీఐ దాడుల కారణంగా విపక్షాల మధ్య ఐక్యత మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి.