YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చేసిన తప్పే మళ్లీ.

చేసిన తప్పే మళ్లీ.

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పట్టణంలోని పలు ప్రధాన కాలువలను శుభ్రంచేసే ప్రక్రియ పురపాలక సంఘం నిత్యం చేపడుతోంది. దీనికోసం ఏటా రూ.50 లక్షలకు పైగా వెచ్చిస్తుండగా అధికారులు, సిబ్బంది మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తుండటంతో రూ. లక్షల ప్రజాధనం వృథా అవుతోంది. కొద్దిగా దృష్టి సారించి, పలు జాగ్రత్తలు పాటిస్తే కాలువలు పూడుకుపోకుండా ఉండే అవకాశం ఉంది. అయితే దశాబ్ద కాలంగా అధికారులు, ప్రజల్లో నిర్లక్ష్యం ఆవహించి ఉండటంతో ఏటా కాలువల్లో పూడిక తొలగింపునకు రూ.లక్షలు కుమ్మరిస్తున్నా క్షేత్రస్థాయిలో వీధి కాలువల పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడడం లేదు.
జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న చర్చి నుంచి శ్రీనివాసా థియేటర్‌ వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర ఉన్న వరదనీటి కాలువ నిర్మాణంలోనే లోపం ఉంది. దీంతో తరచూ ఈ కాలువ పూడుకుపోతుండగా ఏటా రూ.లక్షలు వెచ్చించి శుభ్రం చేయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మరోసారి రూ.5 లక్షలు ఈ కాలువలో పూడిక తీయడానికి ఇటీవలే కౌన్సిల్‌ కేటాయించింది. కాలువగట్లు కిందికి ఉండటంతో చుట్టూ ఉన్న మట్టి జారి కాలువలో పడి పూడుకుపోతోంది. దీనికి తోడు దగ్గరలో ఉన్న చెట్ల ఆకులు, చెత్త, వ్యర్థాలు పెరిగిపోవడంతో ఈ కాలువ నిరుపయోగం అవుతోంది. కాలువ గట్ల ఎత్తు పెంచాలని ఎంతోకాలంగా పలువురు సూచిస్తున్నా అధికారులు పట్టించు కోలేదు.
టైలర్స్‌ కాలనీ నుంచి బాలాజీ రోడ్డు కూడలి వరకు ఉన్న మరో ప్రధాన డ్రైనేజీ శుభ్రం చేయడానికి రూ. 5 లక్షలు కేటాయించారు. అయితే ఈ కాలువ పరిస్థితి కూడా అంతే. మురుగు, వర్షపునీరు ముందుకు పోయే అవకాశంలేక వర్షాకాలంలో నిత్యం పొంగిపొర్లుతోంది. ప్రధానంగా పోలీస్‌క్వార్టర్స్‌ లైను జలమయమైపోతోంది. రోడ్డుపై వాహనాల రాకపోకలతో పెద్దఎత్తున దుమ్ము,  ధూళి నిల్వవుండి గాలికి, వర్షాలకు అవి కాలువలో చేరుతున్నాయి. బాలాజీ రోడ్డు నుంచి నూకాలమ్మ పుంతరోడ్డులోని కాలువ, పెంటకోట రోడ్డులో వీరవరపుపేట నుంచి కవలపాడు చెరువు వరకు  ఉన్న మరో కాలువ, టీచర్స్‌కాలనీ మీదుగా చెరువుకు వెళ్లే కాలువ, జ్యోతినగర్‌, అమ్మాజీపేట, ఆశ్రమ వీధుల్లో ఉన్న డ్రైనేజీల్లో పూడిక తొలగింపునకు సుమారు రూ. 20 లక్షలు మంజూరు చేశారు.
ఆయా కాలువల్లో భారీగా తీసిన అనేక రకాల వ్యర్థాలు కొన్ని చోట్ల కాలువ గట్లపైనా, దగ్గరలో ఉన్న ఖాళీ స్థలాల్లో వేసి వదిలేస్తున్నారు. తొలగించిన వాటిని దూరంగా డంపింగ్‌యార్డుకో, ఇతర ఖాళీ ప్రదేశాలకో తరలించాల్సి ఉండగా అధికారులు ఆ దిశగా ఆలోచించకుండా కాలువను శుభ్రం చేశామా లేదా... అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో మట్టి, చెత్త తిరిగి కాలువల్లోకి చేరి పూడుకుపోతున్నాయి. పురవీధుల్లో కాలువ వ్యవస్థ చాలా వరకు దెబ్బతినడానికి ప్రధాన కారణంగా పాలిథిÇన్‌ కవర్లు చెప్పవచ్చు. వ్యాపారులు, ప్రజలు వీటిని యథేచ్ఛగా వాడేసి ఎక్కడ పడితే అక్కడ పారేస్తుండటంతో ఇవి గాలికి ఎగిరి కాలువల్లో చిక్కుకుని మురుగునీటిని ముందుకు కదలనివ్వడం లేదు. అలా ఒక్కొక్కటిగా నిల్వఉండి భారీగా పేరుకుపోతున్నాయి.
ఏడాదికోసారి పూడుకుపోయిన కాలువను శుభ్రంచేసే కన్నా, నిత్యం కార్మికులు ఈ దిశగా దృష్టిసారిస్తే డ్రైనేజీ వ్యవస్థ బాగుపడుతుందని పలువురు అంటున్నారు. నిర్లక్ష్యంగా వదిలేసి పూడుకుపోయాక రూ.లక్షలు ఖర్చుపెట్టే కన్నా, స్వచ్ఛభారత్‌, స్వచ్ఛఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమాల్లో భాగంగా పురపాలక సంఘానికి మంజూరైన అనేక యంత్రాలు, సామగ్రిని వినియోగించి రోజువారి పనులు చేపట్టాలని సూచిస్తున్నారు.

Related Posts